YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉపాధి హామీ పధకం కిందకు పాడిపరిశ్రమ

 ఉపాధి హామీ పధకం కిందకు పాడిపరిశ్రమ

రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవటానికి గ్రామాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా భాగస్వామ్యంతో కూడిన ప్రణాళిక పథకం ఇంటిగ్రేటెడ్ పార్టిసిపేటేడ్ ప్లానింగ్ ఎక్సర్‌సైజ్ కింద 79 మండలాల్లో నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ సర్వేద్వారా గ్రామంలో పేదలు, కూలీలను గుర్తిస్తారు. అనంతరం గ్రామసభలు నిర్వహించి గ్రామానికి సంబంధించి పనుల అవసరాలు, పనుల సంఖ్యను, వ్యక్తిగత పనులను కూడా గుర్తిస్తారు. పాడి పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాడి రైతుకు భరోసాగా ఉండాలని నిర్ణయించింది. పశువులను పెంచే రైతుకు సౌకర్యాలు కల్పిస్తేనే అటు వ్యవసాయం ఇటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన పనులు ఉపాధి హామీ నిధులతో చేసుకునే అవకాశం కల్పించింది. పాడి రైతు అవసరమయ్యే పశుగ్రాసం సాగు, వేసవి నేపథ్యంలో పశువుల దాహం తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణం, అజొల్లా జాతి పశుగ్రాసం పెంపకం, ఇతర గడ్డికి అవసరమైన గుంటలు తవ్వుకోవడం, గోదాముల నిర్మాణం, చెరువుల్లో గడ్డి పెంపకం, ఊరూరా పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటు తదితరాలు ఉపాధి హామీ పథకం కింద చేపట్టవచ్చు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు గుర్తించి, చేపడతారు. ఇప్పటివరకు పనులు ఒకచోట బిల్లులు మరోచోట చెల్లించేవారు. ఇకపై అన్నింటిని ఒకే చోటకు చేర్చి పనులు వేగవంతానికి ప్రభుత్వం మార్గం సుగమంచేసింది. ఉపాధి హామీ నుంచి వచ్చే నిధుల మళ్ళింపును సద్వినియోగం చేసుకుని, పాడి రైతుకు మేలు చేకూర్చేందుకు క్షేత్ర స్థాయిలో వీటిని అమలుచేసేందుకు రంగం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పనులు మాదిరిగా క్షేత్ర స్థాయిలో పారావెటర్నరీ సిబ్బంది అవసరమైన పనులను గుర్తిస్తారు.ఆయా జిల్లాల్లో కలెక్టర్ నుంచి సాంకేతిక అనుమతి పొందుతారు. పనులు చేయించడం, కొలతలు వేయడం పశుసంవర్ధక శాఖ పరిధిలో పనిచేసే ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. బిల్లుల మంజూరు తదితర వ్యవహారాలు ఆ శాఖకు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారికి అప్పగించారు. ఈ పనుల ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాలోని 13,28,863 గేదె జాతి, 7,92,017 గోజాతి పశువులతోపాటు గొర్రెలు, మేకలు తదితరాలకు పుష్కలంగా పశుగ్రాసం అందుబాటులోకి వస్తుంది.

Related Posts