తుగ్గలి మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు రబి ఈ-క్రాప్ బుకింగ్ ను ప్రారంభించారు.బుధవారం రోజున మండల పరిధిలోని గల రాతన,తుగ్గలి,గిరిగేట్ల మరియు కడమకుంట్ల గ్రామాలలో ఈ-క్రాప్ బుకింగ్ ను అధికారులు ప్రారంభించారు. ఈ-క్రాప్ బుకింగ్ విధానాన్ని ఏడిఏ మహమ్మద్ ఖాద్రి మరియు మండల వ్యవసాయాధికారి పవన్ కుమార్ లు పరిశీలించారు.అనంతరం ఎడిఎ ఖాద్రి మాట్లాడుతూ రబీ ఈ-క్రాప్ బుకింగ్ మొదలైనట్లు గ్రామంలో దండోరా వేయించి,ప్రతీ రైతుకు తెలిసేవిధంగా ప్రచారం చేయాలని తెలియజేశారు.రైతులు తమ పంటను ఈ-క్రాప్ బుకింగ్ చేయించుకొనుటలో ప్రతీ రైతుకు కూడా బాధ్యత ఉండాలన్నారు.ఈ-క్రాప్ బుకింగ్ పూర్తైన తర్వాత రైతుల జాబితాను ప్రతీ రైతు భరోసా కేంద్రంలో అతికించి,అతికించిన విషయం దండోరా ద్వారా తెలియజేయాలని,వాలంటీర్ల ద్వారా గ్రామసభ నిర్వహించి అర్హత ఉన్న ఏ రైతు పేరైనా నమోదు కాలేకపోతే ఉన్న సమయం లోపల మరలా రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్లు కలిసి రైతుల వివరాలు పరిశీలించి ప్రతీ అర్హత గల రైతు పేరు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలియజేశారు.ఈ-క్రాప్ బుకింగ్ ప్రకారం పంటల భీమా,మధ్ధతు ధర మరియు విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందే విధంగా ఈ వివరాలు ఉపయోగపడతాయని,కావున అధికారులు చాలా జాగ్రత్తగా ఈ-క్రాప్ బుకింగ్ చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జిలాన్ బాష,లక్ష్మి చైతన్య, రంగన్న,విఆర్వో లు నాగేంద్ర,రామలింగప్ప,రవి లు,విఆర్ఏ లు,ఎంపిఈఓ లు,విఏఏ లు, విహెచ్ఏ లు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.