ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో నాగమ్మ అనే దళిత మహిళను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సీఎం జగన్ సొంతూరిలోనే మహిళలకు రక్షణ లేదంటే, ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటంటూ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. తాజాగా సినీ నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి సైతం ఈ ఘటనపై భావోద్వేగం చెందారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.దివ్యవాణిముఖ్యమంత్రి జగన్ సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని దివ్యవాణి దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదని, మహిళలపై రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైందని.. ఈ విషయం బయటకి రాకుండా ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని దివ్యవాణి ఆరోపించారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలని విమర్శించారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.