రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. నిన్న సానుకూలంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో..నేతలకు ఎప్పుడూ పరీక్షే అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి పెద్ద సంక్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్. దీనికి కారణం.. వెంకటేష్ ఫ్యూచర్ కోసమంటూ.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చీరాల్లో గెలిచినప్పటికీ.. సీనియర్ నాయకుడే అయినప్పటికీ.. టీడీపీలో ముప్పయేళ్ల అనుబంధం ఉన్నా కూడా కరణం వాటిని వదిలేసుకుని వైసీపీకి మద్దతుదారుగా మారారు.అంటే.. తన కుమారుడు వెంకటేష్‌ను వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దింపి గెలిపించుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారు. 2014లో అద్దంకి నుంచి పోటీ చేసిన వెంకటేష్ ఓడిపోయారు. సరే! ఇప్పుడు ఏమైందంటే.. గడిచిన ఆరు మాసాల కిందట ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. చీరాలలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం హవానే ఉంది. పైగా చీరాలలో పార్టీ శ్రేణులు కరణంను అంగీకరించే పరిస్థితి లేదు.పోనీ.. తమ సొంత నియజకవర్గం అద్దంకిలోనే భవిష్యత్తును తేల్చుకుందామా ? అంటే.. అక్కడ నుంచి గెలిచిన గొట్టిపాటి రవి కుమార్ కూడా ఊగిసలాటలో ఉన్నాడు. పార్టీలో ఉందామా ? వైసీపీ తీర్థం పుచ్చుకుందామా ? అని చర్చించుకుంటున్నారు. గత కొంత కాలంగా గొట్టిపాటి గ్రానైట్, ఇతరత్రా వ్యాపారాలపై భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఆయన వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎంత కాదన్నా.. ఆర్ధిక మూలాలు దెబ్బతింటే.. ఏ నాయకుడికైనా కష్టమే. సో.. ఆయన కూడా త్వరలోనే వైసీపీ గూటికి చేరుకోవచ్చనే వాదన వినిపిస్తోంది.దీంతో ఇక్కడ మళ్లీ ఆయనకే వైసీపీటికెట్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ కండీషన్ మీదే గొట్టిపాటి వైసీపీ రీ ఎంట్రీ ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. ఇక బలరాం వారసుడికి ప్రస్తుతం కనిపిస్తోన్న ఆప్షన్ పరుచూరు మాత్రమే. అక్కడ రావి రామనాథం బాబుతో పార్టీకి ఉపయోగం లేదని జగన్ భావిస్తున్నారు. కరణం గోలను వదిలించుకునేందుకు అక్కడకు వెళ్లమంటున్నా (గతంలో ఇదే ప్రాంతానికి మార్టూరు నియోజకవర్గం ఉన్నప్పుడు బలరాం టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు ) అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్ట్రాంగ్‌గా ఉండడంతో కరణం ఫ్యామిలీ పరుచూరు వైపే తొంగి చూడడం లేదు. ఇలా.. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కరణం కుమారుడికి సానుకూల పరిస్థితి కనిపించడంలేదు. ఏదేమైనా ఎన్నో ఆశలతో వైసీపీలో చేరిన కరణం వారసుడి పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది.