ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతి రెచ్చిపోయారు. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ దగ్గర హంగామా చేశారు. టోల్ ఫీజు చెల్లించాలన్న సిబ్బందిపై చేయి చేసుకున్నారు. 'నన్నే టోల్ కట్టమని చెబుతావా' అంటూ సిబ్బందిపై చిందులు తొక్కారు.. పరుష పదజాలం ఉపయోగించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె పక్కకు లాగేశారు. కారు సైరన్ మోగిస్తూ నానా బీభత్సం చేసిందిఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. 'నన్నే ఆపుతావా'అంటూ కోపంతో ఊగిపోయారు. తన కారును ఆపితే.. మీ గతి ఏమవుతోందో చూడండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆమె విశ్వరూపం చూసిన టోల్ సిబ్బంది బెంబేలెత్తిపోయి పక్కకు తప్పుకున్నారు. అడ్డంగా పెట్టిన బారికేడ్‌లను తీసుకొని విజయవాడ వెళ్లిపోయారు. ఈ సీన్ మొత్తాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఘటన బయటపడింది.మొత్తానికి రూ.60 టోల్ ఫీజ్ కోసం అల్లరి అల్లరి చేసింది రేవతి. తన పరువు పోయేలా చేసుకుంది. ఒక్క ప్రజాప్రతినిధులు మినహా...నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న ఎవ్వరైనా సరే టోల్ ఫీజు కట్టాల్సిందే. ఎవ్వరికీ మినహాయింపు ఉంటుందో కూడా టోల్ సిబ్బందికి తెలుసు. ఐతే కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర చోటా బడా నేతలు స్థానికంగా తమ పలుకుబడిని ఉపయోగించి టోల్ ఫీజు కట్టకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని టోల్ గేట్ సిబ్బంది వాపోయారు. రేవతి చేసిన హంగామా అంతా అక్కడి సిబ్బంది సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అధికారి అయితే టోల్ ఫీజు కట్టకూడదా..అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.మరో వైపు టోల్ గేట్ సిబ్బంది పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చి సీసీటీవీ ఫూటేజ్ అందించారు...