ఆయన టీడీపీ ఎమ్మెల్యే. అసెంబ్లీకి హాజరయ్యారు. ఇటీవల కాలంలో టీడీపీ సభ్యులకు పెద్దగా సభలో మాట్టాడేందుకు అవకాశం ఇవ్వని స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఈ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇచ్చారు. దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. ఈ 20 నిమిషాల్లోనూ ప్రభుత్వాన్ని, జగన్‌ను తెగ పొడిగేశారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. అరే ఏమైంది.. అసలు మనోడేనా ? అని సందేహాలు వ్యక్తం చేశారు. అంతేకాదు.. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చేసాగుతోంది. మరి ఆయన ఎవరు ? ఎందుకు ప్రతిపక్షంలో ఉండి .. అధికార పక్షం పాటపాడారు ? అనే సందేహాలు పరిశీలిస్తే తెరవెనక చాలా కథే ఉందంటున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మంతెన రామరాజు. గత ఏడాది ఎన్నికల్లో అనూహ్యంగా (ఒక చిత్రమైన పరిస్థితిలో) టికెట్ దక్కించుకున్న ఈయన టీడీపీ తరఫున విజయం సాధించారు. పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినా.. రాలేదు. దీంతో ప్రతిపక్షంలో ఉన్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత రాజుల కోటలో తాను ఒక్కడే ఎదురు తిరిగి.. ఏమీ సాధించలేక పోతున్నానని ఆయన గ్రహించేశారు. పైగా మంత్రి శ్రీరంగనాథరాజు దూకుడు ఎక్కువగా ఉంది. ఉండిలోనే అధికార వైసీపీకి చెందిన నలుగురు రాజులు పెత్తనం చేస్తుండడంతో ఎమ్మెల్యేగా ఉన్నా మంతెన రామరాజును మాటను కనీసం వార్డు స్థాయి అధికారి కూడా పట్టించుకోవడం లేదు.ఇటు టీడీపీలోనూ స్థానిక కేడర్ మంతెన రామరాజును ఎమ్మెల్యేగా అంగీకరించే పరిస్థితి లేదు. ఉండి టీడీపీ కేడర్ అంతా మాజీ ఎమ్మెల్యే శివ కంట్రోల్ లోనే ఉంటుంది. ఇటు ఎమ్మెల్యేగా ఉన్నా పనులు కావట్లేదు.. అటు సొంత పార్టీలోనూ గ్రిప్ లేదు. ఒకానొక దశలో మంతెన రామరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా వచ్చింది. చివరకు ఆయన వైసీపీ నేతలతో సర్దుకు పోతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీపై ప్రత్యక్ష పోరుకు గతంలో చంద్రబాబు అనేక పర్యాయాలు పిలుపు ఇచ్చినా.. మంతెన రామరాజు ఎక్కడా పట్టించుకోలేదు.ఇక, ఇప్పుడు ఏకంగా ఏమనుకున్నారో.. ఏమో.. జగనన్న చేయూత పథకంపై ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చలో మైకందుకున్న మంతెన రామరాజు.. జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. పథకాన్ని ఆకాశానికి ఎత్తేశారు. గత ప్రభుత్వంలోనూ చేయాలనుకున్నారంటూ.. కొన్ని పరోక్ష విమర్శలు కూడా గుప్పించారు. తన ప్రసంగంలో పదే పదే మన ప్రభుత్వం.. మన ప్రభుత్వం అని సంబోధించారు. ఈ పరిణామాలతో అధికార పక్షం ఏమనుకున్నప్పటికీ.. టీడీపీ మాత్రం ఆత్మరక్షణలో పడిపోయింది. మొత్తానికి సర్దుబాటు రాజకీయాలు బాగానే వర్కవుట్ అవుతున్నాయని ఉండి నాయకులు చర్చించుకోవడం గమనార్హం.