వైసీపీ మంత్రి కొడాలి నాని ఎన్టీయార్ కి వీర భక్తుడు. నందమూరి హరిక్రిష్ణకు భక్త హనుమాన్. ఆయనకు రాజకీయాల కంటే కూడా నందమూరి కుటుంబం మీద ప్రేమే ఎక్కువ. ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటే కొడాలి నాని కి గిట్టదు. అయితే హరిక్రిష్ణ అనుచరుడుగా ఉంటూ అప్పట్లో సర్దుకుపోయేవారు. ఇక హరికే టీడీపీలో ఠికాణా లేని వేళ ఆయన వైసీపీని చూసుకున్నారు. ఇక ఆయన తన టార్గెట్ అంతా టీడీపీ మీద చంద్రబాబు మీద నాటి నుంచే పెడుతూ వచ్చారు. ఇపుడు ఆయన మంత్రి అయ్యారు. ఇక బాబును చెడుగుడే ఆడుకుంటున్నారు.కొడాలి నానికి తాను మంత్రిని అవుతాను అన్నది ఊహకైనా లేదు. కానీ జగన్ తెలివిగా క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గం పట్టుని చూసి, టీడీపీ బలం చూసి కొడాలి నాని ని మంత్రిని చేశారు. దాంతో నాని తన శాఖ పట్ల ఎంత శ్రద్ధ చూపుతారో తెలియదు కానీ జగన్ అప్పగించిన రాజకీయ బాధ్యతలను మాత్రం విజయవంతంగా నెరవేరుస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని జగన్ అనుసరించి కొడాలి నాని అనే కొడవలిని ప్రయోగించారు. దాంతో టీడీపీ అనే చెట్టు మీదనే ఆ కొడవలి వేటు పదునుగా గురి చూసి మరీ పడుతోంది.జగన్ ఆలోచన ఏంటి అంటే కమ్మ వారికి నాయకుడు బాబు కానే కాదు అన్నది నిరూపించడం. వారికి ఎన్టీయార్ మాత్రమే ఏకైక నాయకుడన్నది చెప్పడం. అది జగన్ కూడా అంగీకరిస్తారు. ఎన్టీయార్ పేరిట జిల్లాను కూడా ఏర్పాటు చేస్తానని జగన్ విపక్ష నేతగా హామీ కూడా ఇచ్చారు. ఇక జగన్ ఉద్దేశ్యం కమ్మలు అంతా బాబుని నమ్ముకోవద్దని చెప్పడమే. దాన్ని జగన్ చెబితే ఎవరూ పెద్దగా విశ్వసించరు. అదే సామాజికవర్గానికి చెందిన ఎన్టీయార్ వీరాభిమాని కొడాలి నాని చెబితే వింటారు. కొందరైనా అలోచిస్తారు. కమ్మల ప్రయోజనాలకు తాను పూర్తి భరోసా అని కూడా చెప్పడం జగన్ మరో ఆలోచన.చంద్రబాబు బలమంతా నీట్లో మొసలి మాదిరిగా కమ్మ సామాజికవర్గం చేతుల్లోనే ఉంది. చంద్రబాబు ప్రజా ఉద్యమాలు చేసి నాయకుడు కాలేదు. ఆయన ముందు ముఖ్యమంత్రి అయి తరువాత జనం మెప్పు పొందేందుకు మీడియా సహా అనేక వ్యవస్థలను ఉపయోగించుకున్నారు అని కూడా చెబుతారు. ఇక బాబు తన రాజకీయం కోసం పుట్టిన రాయలసీమను కూడా వదిలేసి కోస్తా కమ్మలు చెప్పినట్లుగా నడచుకుంటున్నారు అన్నది తెలిసిందే. ఏపీలో కమ్మలకు ఒక రాజకీయ పార్టీ ఎన్టీయార్ ఏర్పాటు చేయకముందు ఏ వైషమ్యాలు లేకుండా వారు కాంగ్రెస్ తోనే కలసి ఉండేవారు. మళ్ళీ ఆనాటి పరిస్థితి తేవాలని జగన్ ఉద్దేశ్యం. వైసీపీ వారికి అండగా ఉంటుంది బాబుని వదిలి పెట్టి రావాలని కూడా జగన్ ఇండైరెక్ట్ పిలుపు. దాని కోసం కొడాలి నానిని ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు పారిపోయే నాయకుడే కానీ నిలిచి గెలిచే వాడు కాదని తాజాగా కొడాలి చేసిన హాట్ కామెంట్స్ బాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేసేవే. ఇప్పటికే బాబు టీడీపీ పట్ల, లోకేష్ పట్ల విసిగిపోయిన కమ్మలకు కొడాలి నాని మాటలు గట్టిగా ప్రభావితం చేస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో టీడీపీ కనుమరుగు అయినట్లే.