YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్ట్ టైం పొలిటిషియన్ గా కిడారి

 పార్ట్ టైం పొలిటిషియన్ గా కిడారి

విశాఖ జిల్లా ఏజెన్సీలో మొదట్లో టీడీపీకి గట్టిగానే బలం ఉండేది. కానీ వైఎస్సార్ పీసీసీ చీఫ్ అయ్యాక మొత్తం సీన్ మారిపోయింది. విశాఖ ఏజెన్సీలో కాంగ్రెస్ బలం ఒక్కసారిగా పెరిగింది. అది లగాయితూ రెండు దశాబ్దాలుగా విశాఖ మన్యంలో సైకిల్ పార్టీ దైన్యంగానే పడుతూ లేస్తూ పాకుతోంది. ఇక వైఎస్సార్ నుంచి జగన్ కి ఆ ఓటు బ్యాంక్ మెల్లగా వచ్చి చేరింది. దాంతో 2014 లో అరకు లోక్ సభ, అసెంబ్లీ, పాడేరు సీటు కూడా వైసీపీ పరం అయ్యాయి. 2019 ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. మెజారిటీలు కూడా భారీగా వచ్చాయి.అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు 2018లో మావోయిస్టుల దాడిలో మరణించారు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచే రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎమ్మెల్సీగా ఉంటూ ఆ తరువాత తన రాజకీయ గురువు కొణతాల రామక్రిష్ణ ప్రోద్బలంతో వైసీపీలో చేరి అరకు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన టీడీపీలోకి జంప్ చేశాక కానీ అక్కడ పసుపు పార్టీకి పచ్చదనం రాలేదు. ఆయన బలమైన నాయకుడు. పైగా రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న నేత. ఆయన మరణంతో వారసుడిగా వచ్చిన కిడారి శ్రావణ్ కుమార్ ఆరు నెలల పాటు మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.అరకు, పాడేరు ఈ రెండూ కూడా వైసీపీకి కంచుకోటలు. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకులు లేరు. గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన వారు ఇపుడు చురుకుగా లేరు. పైగా మారిన రాజకీయాల్లో వైసీపీ యువ నేతలను ముందుకు తెచ్చి మరింతగా బలోపేతం అయింది. ఒక బ్యాంక్ ఉద్యోగిగా ఉంటూ వైసీపీలో చేరిన శెట్టి ఫల్గుణ అరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే పాడేరులో కొట్టిగుళ్ళ భాగ్యలక్ష్మి తండ్రి చిట్టినాయుడు టీడీపీ నేత. ఆయన మరణంతో టీడీపీ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. జగన్ భాగ్యలక్ష్మిని తెచ్చి ఎమ్మెల్యేను చేశారు. ఇక ఇక్కడ గిడ్డి ఈశ్వరి ఒక వైపు మరో వైపు మాజీ మంత్రి మణికుమారి వర్గాలుగా ఉన్నా కూడా పార్టీకి బలం లేదు. దాంతో ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది.

అరకు విషయం మరీ దయనీయం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శివేరి సోమును కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. ఆయన వారసులు ఎవరూ చురుకైన వారు కారు. ఇక కిడారి శ్రావణ్ కుమార్ అయితే ఎమ్మెల్యే కాకుండాఎన మంత్రి అయి జాక్ పాట్ కొట్టారు. కానీ రాజకీయ ఓనామాలు పట్టుబడడంలేదు. ఆయన విశాఖలో ఉంటూ అపుడపుడు అరకు వచ్చి పోతూంటారు. ఆయన తండ్రికి సన్నిహితులుగా ఉన్న కొంతమంది, టీడీపీ మీద అభిమానం ఉన్న వారు వెంట ఉంటున్నారు. నిజానికి వైసీపీకి స్ట్రాంగ్ ప్లేస్ గా ఉన్న అరకులో సైకిల్ ని పరుగులు పెట్టించాలంటే సీరియస్ గా పాలిటిక్స్ చేయాలి. యువకుడు అయిన కిడారి ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉంటారా అన్నది ఇప్పటికీ డైలామాయే. ఆయనకు పార్టీ ఎంతవరకూ అండగా ఉంటుంది అన్నది మరో ప్రశ్న. అన్నీ కుదిరిగేనే అరకులో టీడీపీకి ఒక దిక్కు దొరికినట్లు. లేకపోతే మన్యంలో వైసీపీ దూకుడుని ఆపడం కష్టమే

Related Posts