విజయవాడతో కలిపి గుంటూరు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక
నేడు గుంటూరులో ఇంజనీరింగ్ సిబ్బందికి శిక్షణ
ఇప్పటివరకు ఇంజనీరింగ్ శాఖల్లో మాన్యువల్ మెజర్‌మెంట్ బుక్స్ రికార్డింగ్ విధానం అమలు జరుగుతుండగా జలవనరుల శాఖలో ప్రయోగాత్మకంగా ఈ-మెజర్‌మెంట్ విధానాన్ని తీసుకొస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలన్న సీఎం ఆదేశాల అమలులో భాగంగా విజయవాడ, గుంటూరులను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ-మెజర్‌మెంట్ విధానంలో పూర్తి అయిన అభివృద్ధి పనుల కొలతలను ఏ విధంగా నమోదు చేయాలి, వాటిని రియల్‌టైంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడింగ్ వంటి అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. నెల వ్యవధిలో శిక్షణ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసి జిల్లా వ్యాప్తంగా జలవనరుల శాఖలో ఈ-మెజర్‌మెంట్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని అధికారవర్గాలు తెలిపాయు.
జలవనరుల శాఖ పరిధిలో ఏటా రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అయితే ఆయా నిర్మాణ పనులు ఏరోజుకు ఆరోజు కాకుండా ఎప్పటికో ఎంబుక్స్‌లో రికార్డింగ్ చేసేవారు. ఈ క్రమంలో ఎన్నో అవినీతి, అక్రమాలు చోటు చేసుకొనేవి. కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు తీసుకొని ఎంబుక్స్ రికార్డింగ్ చేస్తోన్నారన్న ఆరోపణలు కూడా పలుమార్లు వచ్చాయి. చాలామంది ఇంజనీరింగ్ అధికారులకు ఎంబుక్‌ల నమోదుపై స్పష్టమైన అవగాహన కూడా లేదు. ఆ శాఖలో సీనియర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఆధారపడి వారు తయారు చేసి తీసుకొచ్చిన బుక్స్‌పై సంతకాలు చేస్తుండేవారు.
ఈ విధానాన్ని స్వస్తి చెప్పాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు ఈ-మెజర్‌మెంట్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. కొత్త విధానంలో అభివృద్ధి పనులు జరుగుతోన్న వాటిని నిత్యం సందర్శించాలి. ప్రతీ రోజు మెజర్‌మెంట్స్‌ని రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి. దీని వలన ఏ పని ఎన్ని రోజులకు ఎంత శాతం పూర్తి అయింది వంటి వివరాలు రియల్‌టైంలో తెలిసిపోతాయి. ఇలా నిరంతరం పర్యవేక్షణ ఉండటం వలన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయని అధికారులు చెబుతోన్నారు. ఈ నూతన ఎలకా్ట్రనిక్ విధానంపై జలవనరుల శాఖలో పని చేస్తోన్న అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోన్నారు. ఇప్పటికే ఒక దఫా ఆ శాఖ ఎస్‌ఈ బాబురావు సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను తెలిపారు. రెండో విడత సమావేశం మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో జరగనుంది. ఎలకా్ట్రనిక్ మెజర్‌మెంట్ విధానం బుక్‌లెట్‌లను కూడా సిబ్బందికి అందజేస్తారని అధికారవర్గాలు తెలిపాయి. శిక్షణ పూర్తి చేసిన వెంటనే ఈ-ఎంబుక్ విధానం అమలులోకి తీసుకొస్తామని వివరించాయి.