డిసెంబర్ 21న అంతరిక్షంలో అద్భుతం జరగనుంది. ఇంతకూ ఆ ఖగోళ అద్భుతం ఏమిటనే కదా మీ డౌట్.. గురు, శని గ్రహాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరికి రానున్నాయి. 397 సంవత్సరాల తరువాత ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవ్వబోతోంది. ఇంతకు ముందు 1623లో ఈ రెండు గ్రహాలు అత్యంత సమీపానికి వచ్చాయట.. ఆ తరువాత ఇప్పుడు మరోసారి జరగనుంది. ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేవీ ప్రసాద్ దువారీ మాట్లాడుతూ గురు, శని గ్రహాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరికి 397 సంవత్సరాల తరువాత వచ్చాయని చెబుతున్నారు. ఈ రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి దగ్గరగా రావడంతో పాటు భూమికీ దగ్గరకు వస్తాయని అన్నారు. ఈ ప్రక్రియను సంయోగంగా అంటారన్నారు. ఆ రోజున రెండు గ్రహాలూ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఆ సమయంలో వీటి మధ్య కేవలం 735 మిలియన్ కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ అద్భుతం మళ్ళీ చూడాలంటే మార్చి 15, 2080 వరకూ ఎదురుచూడాల్సి ఉంటుందట. ఏవైనా రెండు ఖగోళ గ్రహాలు భూమి నుంచి చూసినప్పుడు రెండూ అత్యంత సమీపంగా కనిపిస్తే దానిని కంజంక్షన్ అంటారని తెలిపారు. ఇదే గురు, శని గ్రహాల విషయంలో ది గ్రేట్ కంజంక్షన్ అంటారు. ఇప్పుడు కంజక్షన్ జరిగాక.. దీన్ని మళ్లీ చూడాలంటే 2080వ సంత్సరం వరకూ ఆగాల్సి ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డిసెంబర్ 21న రాత్రిపూట ఈ రెండు గ్రహాల మధ్య దూరం కేవలం 735 మిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది.