YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు దీక్షకు జనమే జనం

బాబు దీక్షకు జనమే జనం

చంద్రబాబు దీక్షకు దిగారు. ఒక ఏపీ ముఖ్యమంత్రి దీక్షకు దిగడం ఇదే తొలిసారి. తన పుట్టినరోజు వేడుకలను పక్కనపెట్టిన చంద్రబాబు రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ 12 గంటల ఉపవాస దీక్షకు దిగారు. కేంద్రంపై సమర భేరి మోగించారు. జాతీయ స్థాయిలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పేందుకు చంద్రబాబు ఈ ఉపవాస దీక్షను ఎంచుకున్నారు. సరిగ్గా ఏడుగంటలకు సభా వేదికకు చేరుకున్న చంద్రబాబు సర్వ మత ప్రార్థనల అనంతరం దీక్షకు కూర్చున్నారు. అంతకుముందు సభావేదికపై ఉన్న మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.చంద్రబాబు తన దీక్ష సందర్భంగా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తాను ఏ పరిస్థితుల్లో దీక్ష చేయాల్సి వచ్చిందో బాబు ఆ లేఖలో వివరించారు. కేంద్రం ఏపీ పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకే తాను ఈ దీక్షను ఎంచుకున్నానని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ లోనూ ఏపీకి అన్యాయం చేసిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పొందుపర్చిన ఏ అంశాలనూ కేంద్రం పూర్తి చేయలేకపోయిందన్నారు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయించాల్సి ఉన్నా చేయలేదన్నారు. తాము కేంద్రం ఇచ్చిన ప్రతి పనికీ యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను విభజించాలనే కుట్ర ఇందులో దాగి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రజలను విభజించి కేంద్ర ప్రభుత్వం లబ్ది పొందాలని ప్రయత్నిస్తుందన్నారు. చట్టబద్ధమైన, న్యాయమైన తమ కోర్కెలను గుర్తించని కేంద్ర ప్రభుత్వంపై తన పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికీ తగినన్ని నిధులు కేటాయించలేదని ఆయన ఆవేదన చెందారు.

చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సరిగ్గా ఏడుగంటలకు దీక్ష ప్రారంభించారు. రాత్రి ఏడు గంటల వరకూ ధర్మపోరాట దీక్ష కొనసాగుతుంది. కేంద్రం దిగివచ్చే వరకూ తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు దీక్ష సందర్భంగా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. హనుమాన్ జంక్షన్ మీదుగా నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ కు వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష మంది ఈ దీక్షకు హాజరవుతారని అంచనా.

Related Posts