YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జిల్లాల్లో కమలం... ఆపరేషన్

జిల్లాల్లో కమలం... ఆపరేషన్

వలసలకు బీజేపీ గేట్లు ఎత్తడంతో ఎవరెటు అన్న చర్చ తెలంగాణలో జోరందుకుంది. ఇప్పుడు ఇందుకోసం ఒక్కో జిల్లాలో ఒక్కో విధమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు కమలనాథులు. అయితే… హైదరాబాద్‌కు ఆనుకుని ఉండే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పై కమలదళం వేసిన ప్లానే ఆసక్తి కలిగిస్తోందట.దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు తీసుకొచ్చిన ఊపుతో… హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు బీజేపీ నాయకులు. ఇప్పటికే కొందరిని చేర్చుకున్న కమలనాథులు.. మరికొందరిని ఆకర్షించే పనిలో పడ్డారు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఆకర్షణ వల విసురుతున్నారు. ఈ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీలలో సీనియర్ నాయకులు చాలా మందే ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో కొందరు కుదురుకోలేకపోతే.. సరైన అవకాశాలొస్తే కాంగ్రెస్‌, టీడీపీలకు గుడ్‌బై చెప్పేందుకు మరికొందరు ఎదురు చూస్తున్నారట. ఇలాంటి వారి జాబితా సిద్ధం చేసి వారితో మంతనాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జంప్‌ చేస్తారని అనుకున్నారు. కానీ.. ఎందుకో ఆయన వెనకడుగు వేశారు. ఇప్పుడు మాత్రం ఆయన చూపు బీజేపీపై పడిందని టాక్‌. ఈ విషయం తెలుసుకున్న కమలనాథులు సైతం ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. అయితే అనుచరులతో మాట్లాడిన తర్వాత కాషాయ కండువా కప్పుకొనేందుకు ముహూర్తం ఖరారు చేస్తారని చంద్రశేఖర్‌ చెబుతున్నారు. చంద్రశేఖర్‌ వస్తే వికారాబాద్‌లో బీజేపీ బలపడుతుందని లెక్కలు వేసుకుంటున్నారట కమలనాథులు.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఎ.చంద్రశేఖర్ సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండేవారు. కానీ.. టీఆర్‌ఎస్‌లో ఎక్కువ రోజులు ఇమడలేకపోయారు. కాంగ్రెస్‌లో చేరినా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ రాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలో దిగి ఓడిపోయారు. ముందస్తు ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ గూటికి వచ్చేశారు. అయితే వికారాబాద్‌ కాదని పొరుగున ఉన్న చేవెళ్ల బాధ్యతలను కాంగ్రెస్‌ అప్పగించడంతో చంద్రశేఖర్‌ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పైగా వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే బీజేపీలోకి వెళ్లిపోతున్నట్టు చెబుతున్నారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ తదితరులు బీజేపీలోకి వచ్చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి చంద్రశేఖర్‌ వస్తే ఇంకా బలపడతామని కమలనాథులు భావిస్తున్నారట. అందుకే 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిన కంచర్ల శేఖర్‌రెడ్డి తదితరులపై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్నవారి సంఖ్య జిల్లాలో ఎక్కువగానే ఉంది. అలాంటి చోట ఆశావహులతో టచ్‌లోకి వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేశారట. మరి.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎంత మంది బీజేపీ గేలానికి చిక్కుతారో చూడాలి.

Related Posts