ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సన్నాహలు చేస్తూ.. ఏపీ సీఎస్ నీల సాహ్నీకి మరోసారి నిమ్మగడ్డ లేఖ రాశారు. లేఖలో కోర్టు ఆదేశాలను ప్రస్తావించారు.. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియ జనవరినాటికి పూర్తి చేయాలని సూచించారు. నిమ్మగడ్డ రాసిన లేఖపై సీఎస్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌కు సిద్ధమయ్యారు.. అలాగే సీఎస్‌కు లేఖలు రాశారు. కానీ కరోనా కారణంగా ఎన్నికలు జరపొద్దని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగ సంఘాలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. ఈ వివాదం జరుగుతుండగానే.. ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరగా.. హైకోర్టు తోసిపుచ్చింది.. స్టే ఇవ్వడం కుదరదని చెప్పింది.