దేశంలో కొన్ని రోజులుగా ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగదు కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే కొత్త నోట్లను ముద్రించేందుకు దేశంలోని నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌లు 24 గంటలూ పనిచేస్తున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు. నోట్ల కొరతను నివారించేందుకు దాదాపు రూ.70వేల కోట్ల డిమాండ్‌ను చేరుకొనే దిశగా ఈ వారం ప్రారంభం నుంచే ప్రింటింగ్ ప్రెస్‌లలో ఖాళీ లేకుండా ముద్రిస్తూ 24×7 పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా రూ.500, రూ.200నోట్లను ఎక్కువగా ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీఎంసీఐఎల్ కు సంబంధించిన నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌లు సాధారణంగా రోజుల్లో నోట్లను ముద్రించేందుకు రోజుకు 18నుంచి 19 గంటలపాటు పనిచేస్తుండగా.. 3 గంటల నుంచి 4 గంటల విరామం ఇస్తుంటారని అధికారి పేర్కొన్నారు. కానీ, నగదు కొరత కారణంగా ఏటీఎంలన్నీ ఖాళీ కావడంతో ప్రింటింగ్ ప్రెస్‌లన్నీ విరామం లేకుండా పనిచేస్తున్నట్టు న్యూస్ ఏజెన్సీకి వివరించారు. నోట్ల ముద్రణ 15 రోజులపాటు కొనసాగుతుంది. నగదు కొరతను తీర్చేందుకు ఈ నెల చివరిలోపు రూ.500నోట్ల ముద్రణను ఐదు రెట్లు పెంచారు.రూ. 500 నోట్ల ముద్రణ రోజుకు రూ. 500 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల వరకు పెరుగనుంది. ఒక నెలలో నోట్ల ముద్రణ రూ.70వేల కోట్ల నుంచి రూ.75వేల కోట్ల వరకు చేరుకోనుంది. దీంతో ఇప్పుడువరకు ఉన్న నోట్ల కొరత డిమాండ్‌కు తగినట్టుగా కరెన్సీ నోట్లు చేరువలో ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఇప్పటికే రూ. 2వేల నోట్లు దాదాపుగా 35 శాతంతో రూ.18.43 ట్రిలియన్ల కరెన్సీ చలామణీ అవుతుందని, రూ.6.70 ట్రిలియన్ల పరిమితిని కూడా చేరుకోవడంతో రూ.2 నోట్ల ముద్రణ నిలిపివేశారు. కాగా, గతంలో 2016 నవంబర్ పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా రూ. 2000 కొత్త కరెన్సీ నోట్లను ముద్రించేందుకు ప్రింటింగ్ ప్రెస్‌లు 24 గంటలు పనిచేశాయి.