YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరులో కేడర్ చిత్తైపోయేరా

చిత్తూరులో కేడర్ చిత్తైపోయేరా

టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ అధినేత సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ నేతలు ఓ రేంజ్‌లో పెత్తనం చెలాయించారు. ఇక మదనపల్లి టికెట్‌ కోసం పెద్దఎత్తున పైరవీలకు పాల్పడ్డారు. మాటకు ముందు చంద్రబాబు.. మాట తర్వాత చంద్రబాబు తప్ప మరో పలుకు వచ్చేది కాదు. అలాంటిది 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీడీపీ నేతలకు ఊహించని షాక్‌ ఇచ్చాయి. అప్పటి వరకు నేనే ఎమ్మెల్యే.. నాదే పెత్తనం అని భారీ ప్రకటనలు చేసినవారంతా కంటికి కనిపించకుండా పోయారు. ప్రజలకే కాదు.. పార్టీ కేడర్‌కు కూడా వారు ఎక్కడ ఉన్నారో అంతుపట్టడంలేదు…ఉన్నాం అంటే ఉన్నాం.. చేశాం అంటే చేశాం. ఇదీ మదనపల్లెలోని టీడీపీ నేతల పరిస్థితి. గొంతు ఎత్తితే అధికారపార్టీకి టార్గెట్‌ అవుతామన్న భయమో ఏమో.. ఏడాదిన్నరగా కిక్కురు మనడం లేదు. సొంత జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారంపై అవగాహన ఉన్నా.. పార్టీ అధినేత సైలెంట్ అయ్యారు.మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్‌, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌ కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు గంగారపు రాందాస్‌ చౌదరి, రాటకొండ బాబురెడ్డి తదితరులు 2019 ఎన్నికల్లో టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబు మాత్రం దొమ్మాలపాటి వైపే మొగ్గు చూపారు. కానీ.. వైసీపీ అభ్యర్థి నవాజ్‌ బాషా చేతిలో ఓడిపోయారు దొమ్మాలపాటి.ఎన్నికల సమయంలోనే టీడీపీని వీడి జనసేనలో చేరిన రాందాస్‌ చౌదరి తన భార్య స్వాతిని బరిలో దించారు. ప్రస్తుతం మదనపల్లెలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయినట్టే చెప్పాలి. చాలా మంది ఎవరి దారి వారు చూసుకున్నారు. మదనపల్లె టీడీపీ ఇంఛార్జ్‌గా రమేష్‌ కొనసాగుతున్నారు. ఆ బాధ్యతలు అయితే తీసుకున్నారు కానీ.. ఏడాదిన్నరగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటంలేదట. ఒకవేళ టీడీపీ ఏదైనా పిలుపిస్తే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటోందట రమేష్‌ తీరు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన భూదందాలను బయటకు తీస్తామని వైసీపీ నేతలు హెచ్చరించడం వల్లే రమేష్‌ సైలెంట్‌ అయ్యారని టీడీపీలో చెవులు కొరుక్కుంటున్నారు.మదనపల్లెలో టమోట రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. హంద్రీనీవా జలాలు రాకపోయినా టీడీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరూ పెదవి విప్పటం లేదట. పోరుబాటకు కేడర్‌ సిద్ధంగా ఉన్నా.. నేతలే వెనకంజ వేస్తున్నట్టు చెబుతున్నారు. మీరు రండి.. ధర్నాకు మేం వస్తాం అని ఎవరైనా కార్యకర్తలు చెప్పినా.. ఇప్పుడెందుకులే అని తప్పించుకుంటున్నారట నాయకులు. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులపై కేసులు పెడుతున్నా పార్టీ నుంచి ప్రశ్నించేవాళ్లే లేరట.ఇక ఇక్కడ విషయాలన్నీ ఎప్పటికప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు తెలుసుకుంటున్నారట. అయినా నేతలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదట. మరి.. కేడర్‌ను పట్టించుకునేదెవరో అధినేతకే తెలియాలి.

Related Posts