అధికారపార్టీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా వర్తిస్తుంది. అలా వ్యవహరిస్తూ ప్రజలకు దగ్గరయి వారి సమస్యల పరిష్కారంలో చొరవ చూపించి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వీరంతా బాటలు వేయాలి. కానీ అధినేతల ఆలోచన ఒకలా ఉంటే నేతల తీరు మరోలా ఉంటుంది. కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అన్ని కులాలకు న్యాయం జరగడంతో బాటు ఓటుబ్యాంక్ సురక్షితం అవుతుందని అధికారపార్టీ లెక్కలు. అయితే పార్టీకే కొందరు సమస్యగా మారిపోతున్నారు. తాజాగా ఆ కోవలోకి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నియమితురాలైన రేవతి గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర సృష్ట్టించిన వివాదం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియా లో అయితే మరింతగా రేవతి తీరు ట్రోల్ అయింది.వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నియమితురాలయ్యే వరకు రేవతి పేరు రాష్ట్రం లో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆమె గుంటూరు టోల్ గేట్ సంఘటన తో నిమిషాల్లో సెలబ్రిటీ గా మారిపోయారు. ఈ సంగతి ఎలా ఉన్నా ఆమె వ్యవరశైలి పార్టీకి తలనొప్పిగా మారింది. దాంతో వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ ల పదవీ స్వీకారోత్సవం అధికారపార్టీ వాయిదా వేసుకోవాలిసి వచ్చింది. సరిగ్గా ఇలాంటి దుందుడుకు చర్యలకు గతంలో టిడిపి లో కొందరు నేతలు చేసి ప్రజల్లో ఆ పార్టీని చులకన చేశారు.ముఖ్యంగా నాటి దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడితే సాక్షాత్తు నాటి సిఎం చంద్రబాబు కేసులు లేకుండా సెటిల్మెంట్ చేయడం తీవ్ర విమర్శలకు తెరతీసింది. ఇప్పటికి బాబు సర్కార్ జమానాకు ఒక మచ్చగా మిగిలిపోయింది. నాడు అలాంటి విషయాలపై పోరాటం చేసిన వైసిపి నేడు అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ నేతలు చిరు ఉద్యోగులపై వ్యవహరిస్తున్న తీరు రచ్చ అవుతుంది. రేవతి సంఘటనపై విచారించి జగన్ చర్యలు ఏమేరకు తీసుకుంటారన్నది చర్చనీయంగా మారింది.