బ్యాంకింగ్ ఫ్రాడ్‌లను నివారించేందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జనవరి 1వ తేదీ నుంచి పాజిటివ్ పే సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే బ్యాంకులకు ఆర్‌బీఐ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ విధానం కింద రూ.50వేలు అంతకన్నా ఎక్కువ మొత్తం విలువ కలిగిన చెక్కులకు పేమెంట్లు చేసేటప్పుడు బ్యాంక్ సిబ్బంది క్రాస్ చెక్ చేసుకుంటారు.చెక్కులను ఇచ్చే వారి నుంచి ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎంల ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకులు ఆ చెక్కులకు సంబంధించిన వివరాలను సేకరిస్తాయి. అంటే.. చెక్కుపై వేసిన తేదీ, బెనిఫిషియరీ పేరు, చెల్లించాల్సిన మొత్తం వివరాలు తదితర సమాచారాన్ని బ్యాంకులు తీసుకుని బెనిఫిషియరీలకు చెల్లింపులు జరిపే సమయంలో సీటీఎస్ ద్వారా ఆ వివరాలను మరొకసారి క్రాస్ చెక్ చేస్తారు. దీంతో మోసాలకు ఆస్కారం ఉండదు.అయితే రూ.50వేలు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని ఆర్‌బీఐ చెప్పినా బ్యాంకులు మాత్రం రూ.5 లక్షల కన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులనే ఈ విధానం ద్వారా క్రాస్ చెక్ చేయాలని చూస్తున్నాయి. అయినప్పటికీ ఈ విధానాన్ని ఎంచుకోవడం అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టం అని, ఆ నిర్ణయాన్ని కస్టమర్లకే వదిలేస్తామని, కస్టమర్లు కోరితే ఈ విధానం కింద చెక్కులను క్రాస్ చేస్తామని.. బ్యాంకులు తెలిపాయి.