YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పుష్కర కాలంగా నియామకాలు నిల్

పుష్కర కాలంగా  నియామకాలు నిల్

ఉస్మానియా యూనివర్సిటీ.. మరోవైపు బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో వర్సిటీ బోధనా, పరిశోధనా రంగంలో కొంత వెనుకబాటుకు గురవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యాపకుల కొరతను తీర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన భర్తీ ప్రక్రియ చేపట్టని అధికారులు.. కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన సాగిస్తూ వర్సిటీని ముందుకు నెట్టుకొస్తున్నారు.ఓయూలో 12 ఏళ్లుగా బోధనేతర సిబ్బంది నియామకాలు లేవు. ఆయా విభాగాల్లో ఉన్నవారికి పదోన్నతులు కల్పించడంతో ఏర్పడిన ఖాళీల్లో కాంట్రాక్టు ఉద్యోగులను భర్తీ చేసి పనులు కొనసాగిస్తున్నారు. అధ్యాపకుల విషయానికొస్తే 1989, 1993, 1997లో అధ్యాపక నియామకాలు చేపట్టారు. నియామకాల్లో కొన్ని కోర్టు వివాదాల కారణంగా అన్ని పోస్టులను భర్తీ చేయలేదు. తర్వాత 2007లో, 2013లో తిరిగి నియామకాలు చేపట్టినా ఖాళీలన్నీ భర్తీ కాలేదు.మొత్తం 56 విభాగాలకుగాను మంజూరైన అధ్యాపక పోస్టులు 1267. అయితే ప్రతియేటా పదవీ విరమణ పొందడం, మరో వైపు నియామకాలు లేకపోవడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఓయూలో శాశ్వత ప్రాతిపదికన 585 అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో 600 మంది అధ్యాపకులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వివిధ విభాగాల్లో  మరో 1800 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుందివర్సిటీలో పర్మినెంట్‌ అధ్యాపకులతో పోటీపడి విధులు నిర్వర్తిస్తూ వర్సిటీని కాపాడుకుంటూ వస్తున్న ఉద్యోగులు, అధ్యాపకుల వేతనాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్న తొలి రోజుల్లో అధ్యాపకులు పరిపాలనా భవనం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం ఉద్యోగాలు పర్మినెంట్‌ చేసేందుకు కావాల్సిన సాధ్యాసాధ్యలపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేసి వారిని ఆందోళన నుంచి తప్పించారు.వర్సిటీలో పదవీ విరమణ పొందుతున్న అధ్యాపకుల సంఖ్య పెరుగుతుండటంతో కొన్ని విభాగాలకు అధ్యాపకులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అధ్యాపకులతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఒక్క ప్రొఫెసర్‌ కూడా లేని విభాగాలు ఎనిమిది వరకు ఉన్నాయి. సైకాలజీ విభాగంలో 11 మందికి గాను ఇద్దరే అధ్యాపకులు ఉన్నారు. జియో ఫిజిక్స్‌లో 24 పోస్టులకు గాను ముగ్గురే ఉన్నారు. ఉర్దూ విభాగంలో 19మందికి గాను నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

Related Posts