విజయవాడ, డిసెంబర్ 14,
ప్రజా నాయకుడికి కావలిసింది పబ్లిక్ కనెక్టివిటీ. అంతే స్థాయిలో క్యాడర్ తో అను నిత్యం అనుసంధానమై ఉండటం. ఏడు పదుల వయసులో చంద్రబాబు వంటివారు కరోనా కారణంగా హైదరాబాద్ లో ఉన్నా కనెక్టివిటీ విషయంలో అందరికి దగ్గరగానే ఉన్న అంశం గమనించాలి. ఇక జగన్ దాదాపు పదేళ్ళపాటు ప్రజల్లోనే ఉంటూ క్యాడర్ తో మమేకం అయ్యి అధికార పీఠం కైవసం చేసుకున్నారు. కానీ ఈ అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ గా వ్యవహారం సాగిస్తూ కీలకమైన కనెక్టివిటీ ని బాగా మిస్ అవుతున్నారు. తమ నేత అమావాస్య కు పౌర్ణమి కి ఎంట్రీ ఇస్తూ ఉండటం కార్యకర్తల్లో నీరసాన్ని నింపుతుంది.త్వరలో స్థానిక ఎన్నికలు జరిగే వాతావరణం ఏపీ లో ఉంది. దానికి ముందు తిరుపతి లో పార్లమెంట్ స్థానానికి ఎన్నిక ఉండనే ఉంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీకి దిగి చివరిలో వెనుతిరిగిన వైనం కూడా జనసేన లో అయోమయం సృష్టిస్తుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పట్టు ఏమిటో నేతల క్యాపసిటీ ఏమిటో కూడా అధినేతకు స్పష్టత లేదు. తన కోటరీ ఇచ్చే సమాచారం పైన ఆధారపడి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదే తీరులో గత సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగి జనసేన ఘోరంగా దెబ్బతింది. సంస్థాగతంగా కమిటీల విషయంలోనూ ఆ పార్టీలో గందరగోళంగానే కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన పంథా మార్చుకోవాలని చెప్పే ధైర్యం జనసేన లో ఎవరికి లేకుండా పోయింది.తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక ప్రభంజనం. తన సినీ చరిష్మా ను ఓటు బ్యాంక్ గా మలుచుకోవడంలో ఎన్టీఆర్ ఒక పొలిటికల్ బుక్ అనే చెప్పొచ్చు. నిత్యం ప్రజల్లో ఉంటూ క్యాడర్ బలం బలహీనతలను అంచనా వేయడంలో పార్టీ నిర్మాణంలో ఎన్టీఆర్ ఒక చరిత్రనే లిఖించారు. అంతటి అనుభవాలను పాఠాలు గా నేర్చుకోకుండా చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఎన్నికల వరకే పార్టీ అన్నట్లు నడిపించారు. క్యాడర్ తో కూడా చిరుకు గట్టి సంబంధాలే లేవు. లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా దాన్ని ఓటు బ్యాంక్ గా మలుచుకోవడంలో ప్రజారాజ్యం విఫలం అయ్యింది. అన్న చిరు నేర్పిన పాఠం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గుణపాఠం ఏమాత్రం నేర్చుకోలేదు.పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ కనెక్టివిటి తప్ప జనసంబంధ కార్యక్రమాలు బాగా తక్కువనే చెప్పాలి. తాజాగా జనసేనాని చేపట్టిన వరద ప్రాంతాల పర్యటన మంచి కార్యక్రమమే. అయితే ఇటువంటివి నిత్యం ఎదో ఒకటి చేస్తూ ఆయన ప్రజల్లో ఉండాలి. ఒక పక్క సినిమాలు చేయడాన్ని పెద్దగా తప్పు పెట్టక్కర్లేకపోయినా క్యాడర్ ప్రజా సమస్యలపై రోడ్డెక్కాలిసి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ వస్తేనే సైన్యం కదిలే వాతావరణమే ఎపి లో కనిపిస్తుంది. ఆయనే పార్టీ ఆయనతోనే పార్టీ అనే విధంగా సాగుతుంది. నిజానికి పవన్ కల్యాణే జనసేన బలం అయినప్పటికి క్యాడర్ బాధ్యతలను ఆయన నిర్వచించకపోవడం మైనస్ గానే పరిణమిస్తుంది. పవన్ పార్టీ పెట్టిన తరువాత రెండు ప్రధాన ఎన్నికలను చూసినా తన వైఖరిని పూర్తి స్థాయిలో మార్చుకోకపోవడం జనసేన కు శాపంగానే మారింది.