YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సంపదలు

సంపదలు

జీవితం స్థిరంగా ఉండేది కాదని, హెచ్చుతగ్గులు ఒడుదొడుకులు తప్పవని తెలిసినా మనిషి భావోద్వేగాలకు లోనవుతుంటాడు. ఎప్పుడూ ఏవో కొత్త అనుభవాలను మనిషికి జతచేస్తూ కాలం కదిలిపోతుంటుంది. ‘ఒకరు అదే నదికి రెండోసారి వెళ్లలేరు’ అంటారు ఒక గ్రీకు తత్వవేత్త. అంటే అంతర్గతంగా నది ఎంతో వేగంగా మారిపోతుంటుంది, అంటే నదికి స్థిరత్వం ఉండదని చెప్పడం! అలాగే అనుభవ సంపదా మారుతుంటుంది. మనిషికి తెలియకుండానే నిన్నటి జ్ఞాపకాలు, రేపటి కలలు సంపదలుగా తోడుంటాయి. మనిషి గతానికి, భవిష్యత్తుకు అలవాటుగా అతుక్కుపోతుంటాడు. కాలానుగుణంగా ఎదురయ్యే అనుభవాలను సొంతం చేసుకుంటాడు. అవే సంపదలవుతాయి. ఒక వ్యక్తి నిన్న తోటలోని బంగళాలో, ఈరోజు కార్యాలయంలో, రేపు పనిమీద తన వాహనంలోనో మరెక్కడో ఉన్నాడనుకుందాం. ఆ బంగళా, కార్యాలయం, వాహనం... అన్నింటినీ అతడు తనకు చెందిన సంపదలుగా భావిస్తాడు. వర్తమానంలో అవగాహనతో చూసినప్పుడు అది అంతా ఒక భ్రాంతి... మిథ్య! అవి అతడి సొంతమని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. భూత, భవిష్యత్‌, వర్తమానాల తాలూకు అనుభవాలు రకరకాలుగా వచ్చి చేరుతుంటాయి. అవి అతడి సంపదలుగా మారుతుంటాయి. మనిషికి ఉండే సంపదలు అతణ్ని తృప్తిపరచలేకపోయినా, సంతోషంగా ఉండటానికి సహాయపడకపోయినా... అవి ఎంత గొప్పవైనా- వాటికి విలువ లేనట్లే. ఎన్నో వసతులున్న పడక గదిలో- అతడికి మనస్తాపం కలిగించే ఆలోచననో, అనారోగ్య కారణంగా ఇబ్బందినో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ గదిలోని సౌకర్యాలను అనుభూతి చెందడం సాధ్యం కాదు. సంపదలోని సౌఖ్యాన్ని అనుభవించాలంటే, వర్తమానంలో మనిషి మనసు ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. నిత్యజీవితంలో మనిషి ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆ పని చేయడం యాంత్రికంగా మారుతుంది. ఆహారం తీసుకోవడం, ముస్తాబు కావడం, ప్రయాణం... అన్నీ ఒకదాని తరవాత మరొకటి తెలియకుండానే జరిగిపోతుంటాయి. అలా పట్టనట్లుగా సాగిపోయే పరిస్థితుల్లో అతడు ఉపయోగించే ఖరీదైన సాధనాలకు ప్రత్యేకంగా విలువ ఉండదు. కొంతకాలానికి అనుభూతిరహితంగా మారతాయి. అటువంటప్పుడు అవి ‘ఉన్నా లేకున్నా ఒక్కటే’ అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. అవి అందుబాటులో లేనప్పుడే, మళ్లీ కష్టం తెలుస్తుంది. అలవాటుపడిపోయిన ఆలోచనా విధానాన్ని ప్రశ్నించని పక్షంలో, ప్రపంచాన్ని మరో కోణంలో చూసే అవకాశం ఉండదు. విభిన్న సమయాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో వాటి అసలు విలువ గుర్తించి మసలుకోవడమే మంచి లక్షణం.  సక్రమమైన అవగాహన జీవితంలో ప్రాధాన్యాల విషయంలో ఆలోచనకు ఆస్కారం కల్పిస్తుంది. ఏది అవసరం, ఎప్పుడు అవసరం... లాంటి ప్రశ్నలు వేసుకుంటే, కావాల్సిన సంపదను మాత్రమే కలిగి ఉండేలా చేస్తుంది. అప్పుడు జీవితం తృప్తిగా సాగిపోతుంది. ఏ విధంగా ఆలోచించినా, జీవితంలో మనిషి అనుభవించేది సంపాదించుకున్నదాంట్లో కొద్ది భాగమే! అతడు సంతోషంగా ఉండేది మధుర జ్ఞాపకాల తాలూకు సంపదల వల్లనే! సంపద అంతా వర్తమానంలోని నమూనా. అదే జీవితం. మనిషి ఆ సంపదను అనుభవించినప్పుడు, నమూనాగా మిగిలిపోతుంది. అనుభవించడానికి అక్కరకు రాని సంపద ఎంత ఉన్నా, వృథా కింద లెక్క! వర్తమానంలో కూడబెట్టడం ఒకెత్తు. కూడబెట్టినది అనుభవించడం మరొకెత్తు. అనుభవించగలగడం ఒక అదృష్టం.. 
జై శ్రీమన్నారాయణ

Related Posts