న్యూ ఢిల్లీ డిసెంబర్ 14
దేశంలో చలి పంజా విసురుతున్నది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 10 డిగ్రీ సెల్షియస్ దిగువకు పడిపోయాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. వాయవ్య భారతదేశంలో రాగల నాలుగు రోజులపాటు 3-5 డిగ్రీ సెల్షియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. అయితే, మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం ప్రాంతాల్లో మాత్రం రాగల రెండు, మూడు రోజులు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి హెచ్చు తగ్గులు ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. కానీ ఆ తర్వాత మాత్రం ఆయా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 శాతానికి పడిపోవచ్చని తెలిపింది. ప్రస్తుతం పంజాబ్‌లో చలి తీవ్రత అత్యధికంగా ఉన్నదని, ఆ తర్వాత మాత్రం హర్యానా, చంఢీగడ్, రాజస్థాన్ ప్రాంతాల్లో చలి ప్రభావం చూపుతున్నదని ఐఎండీ వెల్లడించింది.