YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

స్కూళ్లు తెరిచే నాటికి హాస్టళ్ల లో సౌకర్యాలు

స్కూళ్లు తెరిచే నాటికి హాస్టళ్ల లో సౌకర్యాలు

నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ హాస్టళ్ల దశ మారనుంది. విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు వార్డెన్‌ల నుంచి సంబంధిత హాస్టళ్లలో సౌకర్యాల లేమిపై వివరాలను తీసుకున్నారు. ఆ నివేదికలను క్రోడీకరించి కలెక్టర్‌తో పాటు ఎస్సీ సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌కు నివేదించారు. జిల్లాలో 36 పాఠశాల హాస్టళ్లు, 10 కళాశాల హాస్టళ్లు ఉండగా వీటిలో 4,900 మంది వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే ఆయా హాస్టళ్లలో తలుపులు, కిటికీలు, విద్యుత్‌ సౌకర్యం, గోడలకు రంగులు, సున్నం, వాటర్‌ సప్లయి, బోర్‌వెల్, పంపు సెట్టు, సెప్టిక్‌ ట్యాంక్, తదితర మరమ్మతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.అన్ని హాస్టళ్లను కలుపుకుని దాదాపు 60 వరకు టాయ్‌టెట్లు, బాత్‌ రూంలు అదనంగా అవసరం ఉన్నాయని నివేదికలో చేర్చారు. ఎనిమిది హాస్టళ్లకు ప్రహరీలు, వాల్‌ గేట్లు అవసరం ఉందని పేర్కొన్నారు. మరమ్మతులు,  నూతన నిర్మాణాలకు కలిపి దాదాపు రూ.2 కోట్ల 10 లక్షల వరకు నిధులు అవసరం అవుతాయని కలెక్టర్‌కు నివేదించారు. అయితే హాస్టళ్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తెప్పిం చుకోవడం లేదా కలెక్టరే తన నిధుల నుంచి సమకూర్చుతారని సమాచారం. నిధుల అంశం కొలి క్కి రాగానే ఆర్‌అండ్‌బీ, లేదా పంచాయతీ రాజ్‌ అధికారులతో హాస్టళ్లకు మరమ్మతులు, టాయిలెట్లు, బాత్‌ రూంలు, ప్రహరీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నెల 23 నుంచి హాస్టళ్లకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఉం టాయి. ఈ సమయంలో మరమ్మతులు, నిర్మాణాలు పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం జూన్‌ రెండు లేదా మూడవ వారంలో ప్రారంభం కానుండగా సకల సౌకర్యాలతో హాస్టళ్లను తీర్చి దిద్ది విద్యార్థులకు అందిస్తే బాగుంటుందని పలువురు వార్డెన్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీర్ఘకాలికంగా లేదా మధ్యలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలే హాస్టళ్లలో విద్యార్థులకు, వార్డెన్‌లను ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్‌ సరఫరా, బోరు మరమ్మతు లు, తలుపులు, కిటికీలు సక్రమంగా లేకపోవడం తో సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటని అప్పటికప్పుడు సరి చేయడానికి నిధులు సమకూర్చడం వార్డెన్‌లకు సాధ్యం కాదు. ఇలాంటి సమస్యలను తీర్చి సంపూర్ణ పరిష్కారం చూపేందుకు కలెక్టర్‌ హాస్టళ్లపై దృష్టి సారించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు, బాత్‌రూంలు లేక ఇబ్బందిగా మారిన క్రమంలో అదనంగా అవసరమైన టాయిలెట్ల నిర్మాణాలు జరగనున్నాయి.అవసరమైన వాటికి ప్రహరీలు కట్టించడానికి చర్యలు చేపట్టడంతో  సమస్య  తీరిపోనుంది.

Related Posts