పోలవరం ప్రాజెక్టు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ముగిసింది. అంతకుముందు పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సీఎం జగన్ పరిశీలించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించేలా పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్ 45.72 మీటర్లు ఉంటుందని తెలిపారు. టాప్ ఆఫ్ మెయిన్ డ్యాం లెవల్ 55 మీటర్లు ఉంటుందని సీఎం జగన్ అన్నారు. డ్యామ్‌తో పాటు అదే వేగంతో పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరమైన అంశాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మే నెలాఖరు నాటికి స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం ప్రాజెక్టు పనులు ఏరియల్ సర్వే చేశారు. తర్వాత స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల తీరును పరిశీలించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును అధికారులు జగన్‌కు వివరించారు. సీఎం వెంట ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు.ప్రాజెక్టు సమావేశ మందిరంలో నిర్మాణ పనులపై ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లతో జగన్ సమీక్షించారు. సీఎం కొన్ని సూచనలు కూడా చేశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని.. ఆర్థికపరమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నారు. నిర్వాసితులకు కూడా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లికి బయల్దేరారు. ప్రాజెక్ట్ స్పిల్ వేలో 2,17,443 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేశారు. అలాగే 52 మీటర్ల ఎత్తు వరకు స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు.. స్పిల్ వే పిల్లర్లపై 160 గడ్డర్ల ఏర్పాటు పూర్తైంది. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేలా నిర్మాణ పనులు ముమ్మరం చేశారు.