గుంటూరు, డిసెంబర్ 15,
గుంటూరు జిల్లా మొత్తం మీద టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా పల్నాడు ప్రాంతంలో ఆ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న యేడాదిన్నర కాలంలోనే కొత్త జోష్ వచ్చేసింది. గురజాల, వినుకొండ, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో పార్టీ ఊహించని స్థాయిలో పుంజుకుందన్నది వాస్తవం. గత ఏడాది ఎన్నికలలో ఆయా నియోజకవర్గాల్లో కొద్ది తేడాతో కొన్నిచోట్ల ఓటమి.. మాచర్లలో సంస్థాగతంగా కూడా పుంజుకోని వైనం మనకు తెలిసిందే. అయితే తొలి ఏడాది పరిస్థితిని నిశితంగా గమనించిన టీడీపీనాయకులు కొంత సంయమనం పాటించారు. నియోజకవర్గాల్లో దూకుడు తగ్గించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఒక విధమైన శూన్యత ఏర్పడింది.ఆరు నెలలుగా మాత్రం ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేల తప్పులను క్యాష్ చేసుకుంటూ టీడీపీ నాయకులు దూసుకు పోతున్నారు. నరసరావుపేటలో వరుస విజయాలు దక్కించుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. కరోనా సమయంలో ప్రజలకు చేరువగా ఉండడం మానేశారనే టాక్ వినిపించింది. దీంతో ఆయనపై ప్రజల్లో ఒకవిధమైన వ్యతిరేకత చోటు చేసుకుంది. వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో కరోనాను క్యాష్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక్కడ టీడీపీ నాయకుడు చదలవాడ అరవింద్ బాబు పుంజుకున్నారు. పార్టీ శ్రేణులను ఏకం చేసి ప్రజలకు చేరువ చేశారు. సామాజిక సమీకరణలు కావొచ్చు, ఆయన వ్యక్తిత్వం కావొచ్చు తక్కువ సమయంలోనే ఆయన్ను ప్రజలకు చేరువ చేసింది.ఇక, గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దూకుడు పెంచారు. కాసు అటు ఆరోపణల ఊబిలోనూ, ఇటు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత మూట కట్టుకోవడం ఆయనకు మైనస్. ఇక స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతో ఆయనపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత తీవ్రతరమైంది. అదే సమయంలో టీడీపీ నేత యరపతినేని నిత్యం ప్రజల్లోనే ఉంటూ పల్నాడు కేంద్రంగా నరసరావుపేట జిల్లా ఏర్పాటు చేయాలనే ఉద్యమాన్ని ఆయన ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లడంతో ఆయనకు తిరుగులేకుండా పోతోంది.ఇక వినుకొండ నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మానాయుడు అవినీతి ఆరోపణలపై పదే పదే విమర్శలు చేస్తూ ఆయన్ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. జీవీ కౌంటర్లకు బ్రహ్మనాయుడు రీ కౌంటర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. గత కొన్నాళ్లుగా టీడీపీ ఊసుకూడా లేని మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకత వస్తోంది. ఆయన ప్రజలకు దూరంగా ఉంటున్నారనే టాక్ వస్తోంది. నాలుగుసార్లు వరుసగా గెలిచిన ఆయనలో గతంలో ఉన్నంత ఊపు ఇప్పుడు లేదంటున్నారు.కొన్నాళ్లుగా యరపతినేని గురజాలతో పాటు మాచర్లలో కూడా తిరుగుతున్నారు. ఆయనకు స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు భారీ స్వాగతం పలుకుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇక్కడ కూడా పార్టీ ఎదిగేందుకు అవకాశం ఏర్పడింది. ఇలా టీడీపీలో జోష్ కనిపించడానికి ఎమ్మెల్యేలు సహా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు టీడీపీ నేతల దూకుడు కూడా కారణంగా కనిపిస్తుండడం గమనార్హం. మొత్తానికి టీడీపీ ఇంత తక్కువ వ్యవధిలోనే పల్నాడులోనే పుంజుకుంటోంన్న పరిస్థితి క్లీయర్‌గా కనిపిస్తోంది.