రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. రానా బర్త్‌డే సందర్భంగా 'విరాటపర్వం'లో ఆయన ఫస్ట్ లుక్‌తో పాటు ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లో ఆలివ్ గ్రీన్ యూనిఫామ్‌లో నక్సలైట్ లుక్‌లో గన్ చేతబట్టి నడుచుకుంటూ వస్తోన్న రానా కనిపిస్తున్నారు. ఆయన వెనుక షాడోలో గన్స్, ఎర్రజెండాలు పట్టుకొని ఆయన బృందం అనుసరిస్తోంది. కళ్లలోని తీక్ష్ణత రానా పాత్ర తీరును, "రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్" అనే క్యాప్షన్ 'విరాటపర్వం' థీమ్‌ను తెలియజేస్తున్నాయి. పోస్టర్‌పై మొదట సాయిపల్లవి పేరు, తర్వాత రానా దగ్గుబాటి పేరును ప్రస్తావించడం చూస్తుంటే, సాయిపల్లవి పాత్రకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో, ఆమెకు చిత్ర బృందం ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో అర్థమవుతోంది. ఇప్పుడు 'విరాటపర్వం'లో రానా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫస్ట్ గ్లింప్స్ (తొలి వీక్షణం) విషయానికి వస్తే, రానా చేస్తున్న క్యారెక్టర్ ఏమిటో, ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలుస్తున్నాయి. "ఈ దేశం ముందు ఓ ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది.. సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న" అంటూ రానా పాత్రను పరిచయం చేశారు. 1990లలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఒక షాట్‌లో స్టూడెంట్ లీడర్‌గా కనిపించారు రానా. వీడియో చివరలో "ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం?".. అని ఒక కామ్రేడ్ ప్రశ్నిస్తే, మిగతా వారంతా "దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం" అంటూ నినాదాలు చేశారు. రానాకు బర్త్‌డే విషెస్ చెబుతూ తొలి వీక్షణం ముగిసింది. సినిమా "త్వరలో మీ ముందుకి" వస్తున్నట్లు తెలిపారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ వేణు ఊడుగుల మరో ఇంప్రెసివ్ కాన్సెప్ట్‌తో మన ముందుకు రానున్నాడని ఈ చిన్న వీడియో తెలియజేసింది. రానా ఇందులో మొదట మెడికో రవిశంకర్‌గా కనిపించి, తర్వాత కామ్రేడ్ రవన్నగా మారతాడని అర్థమవుతోంది. ఇప్పటివరకూ రానా చేసిన పాత్రలన్నీ ఒకెత్తు అయితే, 'విరాటపర్వం'లోని డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న క్యారెక్టర్ ఒక్కటీ ఒకెత్తు అని చెప్పవచ్చు. ఆ పాత్రలో రానా పర్‌ఫెక్ట్‌గా ఇమిడిపోయి కనిపిస్తున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.
తారాగణం:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి