రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజకవర్గాలతోపాటు, రాజానగరం నియోజక వర్గాల్లో ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు జగనన్న జన్మదిన వారోత్సవాలను ''ఊరు వాడా సంబరాలు'' నిర్వహించనున్నట్లు కాపు కార్పొరేషన్ ఛైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజకవర్గాల వైకాపా కో-ఆర్డినేటర్లు శ్రిఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు వెల్లడించారు. సంక్షేమ పథకాల రారాజుగా, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న జగన్మోహనరెడ్డికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని, ప్రజల ఆశీర్వాదం మరింత లభించాలని కాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక జమిందార్మెట్టపై ఉన్న వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో జక్కంపూడి రాజాతో పాటు వైసిపి సిటీ కో ఆర్డినేటర్ శ్రిఘాకొళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్లీడర్లు మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, సిసిసి ఎండి పంతం కొండలరావు తదితరులు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అటు ప్రజా ప్రతినిధులు.. ఇటు అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని అంశాలను కూడా నెరవేర్చడానికి కృషిచేస్తున్న జగన్ జన్మదినోత్సవాన్ని ఏడాదంతా జరిపినా తక్కువేనన్నారు. ప్రతీ ఇంటికి ఏదో ఒక పథకాన్ని అందించి అందరి కుటుంబాల్లో సభ్యుడిగా జగన్ కొలువై ఉన్నారన్నారు. 16న బుధవారం గాదరాడ గ్రామంలోని ఓం శక్తి పీఠంలో శ్రీ లక్ష్మీగణపతి హోమం, రుద్రహోమం, ఆయుష్య హోమం, 17న శ్రీ విద్యాహోమం, రాజశ్యామల హోమం, ధన్వంతరి హోమం, 18న చండీ హోమం, 19న శ్రీ లక్ష్మినారసింహ సహిత సుదర్శన మహాయాగం, 20న శ్రీ మహాలక్ష్మియాగం, 21న మహా సుదర్శన యాగం, మధ్యాహ్నం 1 గంటకు మహాపూర్ణాహుతి అనంతరం అన్నసమారాధన జరుగుతుందన్నారు. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇంతగా కృషిచేస్తున్న జగన్ పట్ల కొన్ని దుష్టశక్తులు, ప్రతిపక్ష పార్టీలు, దుష్ప్రచారం చేస్తున్నాయని, వారికి కూడా గుణపాఠం, బుద్ధి వచ్చేలా ప్రజా స్పందనను ఈ కార్యక్రమం ద్వారా చూపిస్తామన్నారు. 17న సుబ్రహ్మణ్య మైదానం, ఆనం కళాకేంద్రంలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు, సాయంత్రం 5 నుంచి బాడీ బిల్డింగ్ పోటీలు జరుగుతాయన్నారు. 18న శుక్రవారం కడియం పల్లవెంకన్న నర్సరీలో ప్రభుత్వ పథకాల ఫలపుష్ప ప్రదర్శన,19న మున్సిపల్ స్టేడియం నుంచి పుష్కరఘాట్ వరకు 10 వేల మంది మహిళలతో అక్కచెల్లెమ్మల అడుగుల జాతర.. మహాపాదయాత్ర, సిఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పూలాభిషేకం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి విజయమ్మలకు కూడా పూలాభిషేకం, 20న సర్వమత ప్రార్ధనలు, కరోనా యోధులకు అభినందన సత్కారం నిర్వహిస్తామన్నారు. 21న దివాన్చెరువు ఎంఎఫ్ ఫంక్షన్హాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మెగా బ్లడ్ డోనేషన్ క్యాంప్ జరుగుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కేక్ కటింగ్, సేవా కార్యమ్రాలతో ఊరు-వాడా సంబరాలు చేస్తారన్నారు. రాష్ట్ర మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దఎత్తున హాజరవుతున్నారని తెలిపారు. జక్కంపూడి గణేష్ ఆలోచన మేరకు ఈ వారం రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేసామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ప్రసాదుల హరినాథ్, గుత్తుల మురళీధర్, బొంత శ్రీహరి, కురుమెల్లి అనురాధ,మార్తి లక్ష్మీ, ఎండి కరీంఖాన్, ఆరిఫ్, ఉప్పాడ కోటిరెడ్డి, బురిడి త్రిమూర్తులు, మజ్జి అప్పారావు,మార్తి నాగేశ్వరరావు, కుక్క తాతబ్బాయి, గుడాల జాన్సన్, పెంకే సురేష్,అడపా అనిల్ కుమార్ ఆచంట వెంకట సుబ్బారాయుడు,కోడికోట సత్తిబాబు,వెంట్రపాటి సురేష్, వెలమర్తి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.