అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల ముందు ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది అమెరికా. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని భారత్‌తోపాటు ఇతర దేశాలను హెచ్చరించింది. రష్యా నుంచి ఎస్400 ట్రింఫ్ యాటీ మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై ఆంక్షలు విధించింది. అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ (సీఏఏటీఎస్ఏ) కింద టర్కీపై పలు ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు ఇంటర్నేషల్ సెక్యూరిటీ అండ్ నాన్‌ప్రోలిఫరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ ఫోర్డ్. ఈ చట్టం కింద టర్కీకి చెందిన మిలిటరీ ఆయుధాల సేకరణ సంస్థ ఎస్ఎస్‌బీ, నలుగురు అధికారులపై ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని అన్ని దేశాలు గుర్తించి రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్లను నిలిపేయాలని, లేదంటే సీఏఏటీఎస్ఏ సెక్షన్ 231 కింద ఆంక్షలు తప్పవని ఫోర్డ్ హెచ్చరించారు.
రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియా
ఇండియా కూడా 2018లో ఐదు ఎస్400 యాంటీ మిస్సైల్ వ్యవస్థల కోసం 543 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ను అమెరికా వ్యతిరేకిస్తున్నా.. ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నా.. భారత ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరోవైపు అమెరికా కూడా ఇండియాకు ఆయుధాలను విక్రయిస్తూనే ఉంది. గతేడాది ఇండియాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 350 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 24 సికోర్క్సీ ఎంహెచ్-60ఆర్ సీ హాక్ హెలికాప్టర్లు, ఆరు బోయింగ్ ఏహెచ్-64ఈ అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్లను భారత్‌కు అమెరికా విక్రయించనుంది. ఈ సీఏఏటీఎస్ చట్టాన్ని పలువురు డెమొక్రాట్లు కూడా మద్దతిస్తుండటంతో జో బైడన్ హయాంలోనూ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు.