అమెరికా ఉభయసభల్లో మంగళవారం రక్షణ విధాన బిల్లుకు ఆమోదం దక్కింది. ఆ బిల్లులోనే లడాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా ప్రదర్శిస్తున్న దూకుడును అమెరికా చట్టసభ ప్రతినిధి తప్పుపట్టారు. ఉభయసభల్లో పాసైన రక్షణ బిల్లులో.. భారత సంతతి ప్రతినిధి రాజా కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన తీర్మానం కూడా పాసైంది. ఎల్ఏసీ వద్ద చైనా తన దూకుడు తగ్గించుకోవాలంటూ కృష్ణమూర్తి తన తీర్మానంలో కోరారు. ఈ ఏడాది మే నెల నుంచి భారత్, చైనా మధ్య ఉన్న లడాఖ్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఎల్ఏసీ వద్ద ఉన్న పరిస్థితిపై ఆ బిల్లులో అమెరికా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన రీతిలో భారత్‌తో కలిసి పనిచేయాలని ఆయన చైనాను కోరారు. సైనిక దళాలతో సమస్యను ఉద్రిక్తతం చేయవద్దు అన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌తో పాటు సేనేట్‌లోనూ కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన సవరణలకు ఆమోదం తెలిపారు. అమెరికా తన మిత్ర దేశాలకు, ఇండోపసిఫిక్ ప్రాంతానికి చెందిన ఇండియా లాంటి భాగస్వాములకు అండగా ఉంటుందని ఆ బిల్లులో స్పష్టం చేశారు. రాజా కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన తీర్మానాలను పూర్తి మద్దతు లభించింది. ఒక వేళ ఆ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేస్తే అది చట్టంగా మారుతుంది. ఎన్‌డీఏఏ బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తే, చైనా సైన్యానికి గట్టి హెచ్చరిక చేసినట్లు అవుతుందని, భారత్ పట్ల కవ్వింపులను సహించబోమని కృష్ణమూర్తి అన్నారు.