శ్రీకాకుళం, డిసెంబర్ 17,
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సీఎం మనసు దోచుకున్నారా ? జగన్ కనుసన్నల్లో వ్యవహారాలు నడిపిస్తూ తనదైన శైలిలో సీఎంను ఆకట్టుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా ? ఇది ఫుల్లుగా ఆయనకు ప్లస్ అయిందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జరిగిన ఐదురోజుల అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పూర్తిగా స్పీకర్ అనుసరించిన వైఖరిని పరిశీలించిన వారు.. ఆయన దూకుడు బాగుందని.. సీఎం జగన్‌కు కూడా బాగా నచ్చిందని అంటున్నారు. నిజానికి తమ్మినేని సీతారాం ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో రాజకీయాలు చేయడంలోను ఆయన పేరు పడ్డారు.టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నా.. ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నా..తనకు నచ్చకపోతే.. ఏ పనీ చేయరనే పేరుంది. తొలి ఏడాది స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయన ఈ పంథానే అనుసరించారు. టీడీపీ సభ్యులను సభ నుంచి సస్సెండ్ చేసే విధానంలో ఒకటికి నాలుగు సార్లు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. ప్రభుత్వ పక్షం నుంచి పెద్ద ఎత్తున సస్పెన్షన్‌పై డిమాండ్లు వినిపించినా తమ్మినేని సీతారాం పట్టించుకోలేదు. అసలు స్పీకర్‌గా జగన్ చాయిస్ తమ్మినేని కరెక్టేనా ? అని వైసీపీ వాళ్లే పెదవి విరిచారు.కానీ, ఏడాది తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం తరఫున ఆయన ఆలోచించడం మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ చెప్పినట్టు ఇటు బయటా.. అటు సభలోనూ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పైకి ఇది వివాదాస్పదంగా కనిపించినా.. గతంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగానే స్పీకర్లు వ్యవహరించిన తీరును ఎవరూ విస్మరించలేరని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఈ క్రమంలోనే జగన్‌ను దైవదూతగా కూడా తమ్మినేని సీతారాం సభాపతిగా ప్రస్తుతించడం గమనార్హం.మొత్తానికి జగన్ మనసు దోచుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాంకు త్వరలోనే జగన్ మంచి బహుమానం ఇవ్వనున్నారని వైసీపీలో చర్చసాగుతోంది. తమ్మినేనికి మళ్లీ మంత్రి కావాలనేది బలమైన కోరిక. గతంలో టీడీపీ హయాంలో దక్కిన మంత్రి పదవి తర్వాత.. ఆయన వరుస ఓటములు చవి చూశారు. దీంతో ఆ కోరిక తీరలేదు. ఇప్పుడు జగన్ ఆదిశగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వడంపై సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. జగన్ నుంచి తమ్మినేనికి మంచి గిఫ్ట్ అందడం ఖాయమైనట్టే.