విజయవాడ, డిసెంబర్ 17,
రాజ్యంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా చెప్పాలంటే సెంటీమీటర్ కూడా అటూ అసలు కదలకూడదు. మనకు కొందరు గవర్నర్లు తప్ప చాలా మంది అసలు రాజ్ భవన్ గడప కూడా దాటరు. వారు మీడియా మీటింగులు కూడా చాలా అరుదు. వారు మీడియాకు విడుదల చేసే ప్రెస్ నోట్లు రాజ్ భవన్ నుంచి వస్తాయంతే. ఇక వారు తీసుకునే నిర్ణయాల మీద చర్చ తప్ప వారు నోరు విప్పి మాట్లాడిన సందర్భాలు పెద్దగా ఉండవు. మరి అలాంటి రాజ్యాంగబధ్ధమైన పదవిలో కూర్చున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఏడాది మార్చి లో అర్ధాంతరంగా కరోనా పేరిట ఎన్నికలను వాయిదా వేశారు.ఇక ఆ తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ప్రభుత్వం గట్టిగానే కన్నెర్ర చేసింది. జగన్ లాంటి వారు కులం పేరు తెచ్చి విమర్శలు చేశారు. అప్పట్లో నిమ్మగడ్డ వైపు సానుభూతి వచ్చింది. అయితే నిమ్మగడ్డ ఆ తరువాత వేసిన అడుగులే ఆయన పట్ల జనాల్లో నమ్మకాన్ని తగ్గించాయని చెప్పాలేమో. నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా చెప్పబడుతున్న ఒక లేఖ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకే లీక్ కావడం, అది కూడా టీడీపీ అనుకూల మీడియా కావడంతో ఆయన పొలిటికల్ సూప్ లో పడిపోయారు. ఆ తరువాత మళ్లీ ఏపీ సర్కార్ వైపు కధ నడించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్కుర్చీ కిందకు నీళ్ళు తెస్తూ చట్టంలో సవరణలు తేవడంతో మళ్ళీ నిమ్మగడ్డ వైపు సింపతీ కనిపించింది. మొత్తానికి రాజ్యాంగం ప్రకారం అది తప్పుడు చర్య కావడంతో ఆయన పదవి తిరిగి దక్కింది.ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెండు నెలలుగా మళ్ళీ సందడి చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు అంటూ మీడియాకు ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల పక్షం మీటింగ్ అంటూ హడావుడి చేస్తున్నారు సరే ఇదంతా ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో ఎన్నికలు పెట్టేది లేదు అంటోంది. దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నుంచి మంత్రుల నుంచి కూడా నిమ్మగడ్డకు సమాధానం వచ్చేసింది. మరి ఆ సంగతి తెలిసిన తరువాత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు చేస్తున్నారు అంటే ఆయన కూడా తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారనే లెక్క. ఇక్కడే నిమ్మగడ్డను, ఎన్నికల కమిషనర్ పదవిని జనాలు వేరుగా చూస్తున్నారు. ఆయనకు రాజ్యాంగం ప్రకారం అందుతున్న భరోసా ఎస్ఈసీ పదవి ద్వారా మాత్రమే. నిమ్మగడ్డ ఆ తేడాను చేరిపేసి ముందుకు రావడం వల్లనే ఏపీలో రచ్చ సాగుతోంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు రెడీ అవుతున్నారు. దాని మీద రాష్ట్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయబాబు లాంటి వారు మండిపడుతున్నారు. ఇపుడు ఎందుకు అర్జంటుగా ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారు అని నిమ్మగడ్డను నిలదీస్తున్నారు. కరోనా వస్తే ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణాలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో రెండు వంతుల మంది ఓట్లు వేయకపోవడానికి కరోనా భయం కారణమని కూడా ఆయన అంటున్నారు. అలాగే ఏపీలో ఎన్నికలకు జనం రాకపోతే దాన్ని ఎలా ఎన్నిక అంటారు అని కూడా ప్రశ్నిస్తున్నారు.అయితే హై కోర్టు మాత్రం ఈసీ స్వేచ్చను, హక్కులను కాపాడేలా తీర్పు ఇచ్చింది. దాని అర్ధం ఎన్నికలు పెట్టుకునే అధికారం ఒక ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉంది. కానీ సమయం సందర్భం చూసుకోవాల్సింది ఆయనే. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. ఆయన కెరీర్ లో ఏ వివాదం లేదు . కానీ ఈ పది నెలల్లోనే ఆయన తన చర్యలతో ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకుంటున్నారు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీవిరమణ తరువాత రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఈ రచ్చ ఇలా కొసవరకూ చేయాల్సిందే. అలా కాదు అనుకుంటే మాత్రం ఆయన పెద్దమనిషితనానికి ఇలాంటివి బాగుండవేమో.