గుంటూరు, డిసెంబర్ 17,
రాయపాటి సాంబశివరావు సీనియర్ రాజకీయ నేత. ఆయన దాదాపు మూడు దశాబ్దాల రాజకీయంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ లోనే గడిపారు. కాంగ్రెస్ నే నమ్ముకున్న రాయపాటి సాంబశివరావు రాష‌్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే 2014లో టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా గెలిచిన రాయపాటి సాంబశివరావు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రాకపోవడంతో పాటు నాయకత్వ సమస్యను కూడా ఎదుర్కొంటోంది. దీంతో రాయపాటి సాంబశివరావు పార్టీలో ఇమడ లేకపోతున్నారు. చంద్రబాబు తన కుమారుడి కోసం సత్తెన పల్లి ఇన్ ఛార్జి పదవిని అడిగినా ఇవ్వలేదు. దీంతో రాయపాటి సాంబశివరావు గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.పది నెల క్రితమే రాయపాటి సాంబశివరావు తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ చేరలేదు. దీనికి కారణం ఆయన చిరకాల ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం, రాయపాటి సాంబశివరావు చేరికను ఢిల్లీ స్థాయిలో అడ్డుకోవడంతో ఆయన బీజేపీ కండువా కప్పుకోలేకపోయారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అధ్యక్ష పదవిలో లేరు. ఆయనకు పార్టీలో పెద్దగా ప్రయారిటీ లేదు. సీబీఐ కేసులు కూడా మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి.నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరేందుకు మళ్లీ సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఢిల్లీలో తనకున్న పరిచయాలతో ఆయన సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. కమలం పార్టీలో ఇప్పుడు కండువాలు కప్పే సీజన్ నడుస్తుంది. దీంతో రాయపాటి సాంబశివరావు త్వరలోనే బీజేపీలో చేరతారని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద కన్నా పదవి ఊడటం.. రాయపాటి సాంబశివరావుకు కలిసి వచ్చేట్లు కన్పిస్తుంది.