విజయవాడ, డిసెంబర్ 17,
కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైసీపీ నేతల ప్రాధాన్యం అనూహ్యంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మంత్రి రేసులో ఉన్నారు. వీరిలో అందరికీ తెలిసిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి దూకుడుగా ఉన్నారని అందరూ అనుకున్నారు. వాస్తవానికి గత కేబినెట్ ఏర్పాటు సమయంలోనే తన సీనియార్టీకి గుర్తింపుగా మంత్రి పదవిని ఇస్తారని ఆయన అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ అవకాశం నెల్లూరుకు చెందిన అనిల్‌కుమార్‌కు దక్కింది. దీంతో ఒకింత అలిగిన ఆయన అంతేకాదు జగన్ ఆయనకు విప్ అవకాశం ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. దీంతో విప్ పదవి ఇదే జిల్లాకు చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానుకు దక్కింది. ఆ తర్వాత పరిణా మాల్లో టీటీడీ బోర్డు మెంబర్ పదవిని ఇచ్చారు. ఈ క్రమంలోనే వచ్చే మంత్రి వర్గ విస్తరణలో అయినా పార్థ సారథికి మంత్రి పదవి దక్కుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. గతంలో పార్థసారథికి వైఎస్ 2009లో తన కేబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు. నాడు జిల్లాలో బలంగా ఉన్న కమ్మ, కాపు నేతలను కాదని బీసీ కోటాలో పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చి వైఎస్ సంచలనం క్రియేట్ చేశారు.అయితే ఇప్పుడు పార్థసారథి సీన్ రివర్స్ అయిన పరిస్థితే కనిపిస్తోంది. యాదవ కోటాలో సారథి మంత్రి పదవిపై ఆశతో ఉన్నా ఇదే కోటాలో మంత్రిగా ఉన్న అనిల్‌ను తప్పించేందుకు జగన్ ఇష్టపడడం లేదని జిల్లా పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలో బీసీల్లోనే మరో వర్గం నేతగా ఉన్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దూకుడుగా ఉండడంతో పాటు గౌడ కోటాలో ( గౌడ ఉపకులాల మంత్రి మాత్రమే ఉన్నారు) మంత్రి అంటూ ఎవ్వరూ లేకపోవడంతో జగన్ జోగి రమేష్ పై సానుకూల ధృక్పథంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బీసీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో జోగి రమేష్ బాగానే పనిచేశారనేది వైసీపీ టాక్. ఇది కూడా జగన్‌ను ఆకర్షించిందంటున్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ జోగి దూకుడుగా వ్యవహరించారు. సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. బీసీలకు రాజ్యాధికారం అందించేలా జగన్ వ్యవహరించారని, 132 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు వందల సంఖ్యలో డైరెక్టర్ పోస్టులు ఇచ్చారని పేర్కొంటూ.. జగన్‌పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ధర్మాన లాంటి సీనియర్లతో కేబినెట్లో పనిచేసిన సారథి పూర్తి సైలెంట్ అయ్యారు. ధర్మానకు మంత్రి పదవి లేకపోయినా అసెంబ్లీలో తన వాక్చాతుర్యంతో జగన్ మనస్సు గెలుచుకుంటున్నారు.సారథి అసెంబ్లీలో కాదు కదా కనీసం జిల్లా స్థాయిలోనూ.. చివరకు తన నియోజకవర్గంలోనూ వెనకపడినట్టు పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ వైపు ప్లస్‌లు పడుతున్నాయి. మరోవైపు పార్టీ కూడా జిల్లాలో ఎదిగేందుకు జోగికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో బీసీ వర్గాల్లోనూ జోగికే ఎక్కువ పట్టు ఉండడం ఆయనకు ప్లస్ కానుంది. అందుకే జగన్ సైతం కొలుసు కంటే.. జోగి రమేష్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది.