కర్నూలు, డిసెంబర్ 17,
సహజంగా ఎక్కడైనా ఎమ్మెల్యే మాటకు విలువ ఉంటుంది. కానీ ఎమ్మెల్యేను డమ్మీ చేస్తూ ఒక ఇన్ ఛార్జి వ్యవహరిస్తున్నారంటే ఆయన వెనక ఎవరున్నారన్న చర్చ జరుగుతోది. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ కు, వైసీపీ ఇన్ ఛార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి మధ్య దాదాపు పదమూడు నెలల నుంచి పడటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయే తప్ప ఏ కొంచెం కూడా కుదుట పడలేదు. తనకు రాజకీయాలపైనే విరక్తి పుడుతుందని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిని వెనక ఉండి ఇద్దరు మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యులు నడిపిస్తున్నారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. లేకుంటే జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినా సిద్దార్థ రెడ్డి తన దూకుడును ఆపడం లేదంటే వారి అండ పుష్కలంగా ఉందన్న ఆరోపణలు ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం బహిరంగంగా ఆరోపిస్తుంది. ఎక్కడా లేని విధంగా వైసీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కేసులు నమోదవుతున్నాయంటే అదే బలమైన కారణమని చెబుతున్నారు.గతంలో ఎమ్మెల్యే ఆర్థర్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కూడా ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి అనిల్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే మరో రాజ్యసభ సభ్యుడు కూడా వీరిద్దరి మధ్య పంచాయతీ అనేక సార్లు చేశారు. అయినా ఆయన కూడా ఎమ్మెల్యేకు కాకుండా బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్ధర్ ఎవరికి చెప్పుకోవాలో తెలీని పరిస్థితి నెలకొంది.నిజానికి ఇద్దరూ కలిసి నడిస్తే నందికొట్కూరులో పార్టీ బలోపేతం అవుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బైరెడ్డి సిద్దార్థరెడ్డి రాజీ పడే ప్రసక్తి లేదనిపిస్తోంది. ఆయన మొండిగా ఎమ్మెల్యేతో ఢీకొంటున్నారు. కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని పరిస్థితులు నందికొట్కూరులో నెలకొన్నా అధిష్టానం మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. దీనికి కారణం ఆ ముగ్గురేనంటున్నారు. మరి ఇప్పటికైనా జగన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డిని కంట్రోల్ లో పెడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.