విజయవాడ, డిసెంబర్ 17,
టీడీపీ సీనియర్ నాయకులు, ఆ పార్టీలో దాదాపు 40 ఏళ్లుగా అనుబంధం పెంచుకున్న కింజరాపు కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా శ్రీకాకుళంలో చక్రం తిప్పుతోంది. పార్టీ అదికారంలో ఉన్నా.. లేకుండా ఈ కుటుంబానికి తిరుగులేదు. అయితే.. పరిస్థితి ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఈ కుటుంబాన్ని అధికారులు, రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ జోరు, ఫ్యాన్ హోరు సాగినా.. కింజారపు ఫ్యామిలీ మాత్రం విజయం సాధించింది. టెక్కలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ, శ్రీకాకుళం ఎంపీ నుంచి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూడా ఈ కుటుంబం నుంచి ముగ్గురు టీడీపీ తరఫున విజయం సాధించారు.కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు, ఆదిరెడ్డి భవానీ విజయమైతే.. సాధించారు కానీ రాష్ట్రంలో టీడీపీ మాత్రం పరాజయం పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో వీరిని అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం ఎంపీ, ఎమ్మెల్యేలుగా వారికి ప్రొటో కాల్ నిబంధనలు కూడా పాటించడం లేదు. దీంతో ఇది తీవ్ర వివాదానికి కారణమవుతోంది. క్షేత్రస్థాయిలో వారివారి నియోజకవర్గాల్లో అధికారుల తీరు దారుణంగా ఉండడం, అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వారిని ఆహ్వానించాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు.ఎంపీ రామ్మోహన్.. తన జిల్లాకు సంబంధించి లాక్‌డౌన్‌లో రద్దు చేసిన ఓ ప్యాసింజర్ రైలును తిరిగి పునః ప్రారంభించాలని, ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ బాధితులకు ఉపయోగపడేలా చూడాలని ఆయన రైల్వే శాఖకు లేఖ రాశారు. దీంతో జిల్లా అధికారులను సంప్రదించిన రైల్వే శాఖ.. ఎట్టకేలకు దానిని ప్రారంబించింది. అయితే.. ఈ ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ ప్రకారం ఎంపీని ఆహ్వానించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. రామ్మోహన్ చెప్పిన చిన్నా చితకా పనులు కూడా జరగడం లేదు.ఇక, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పరిస్థితి కూడా ఇలానే ఉంది. నియోజకవర్గంలో ఏ అధికారీ.. వీరిని పట్టించుకోవడం లేదు. దీంతో ఎన్నోసార్లు ఈ విషయంపై వారినే ప్రశ్నించారు. కానీ, ఫలితం రాకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికే విషయాన్ని తీసుకువెళ్లారు. పైగా అచ్చెన్న ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడు కావడంతో వైసీపీ అధిష్టానం ఆయన నియోజకవర్గాన్ని బాగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అక్కడ ముగ్గురు కీలక నేతలను మోహరించడంతో పాటు దువ్వాడ శ్రీనుకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే రేంజ్‌లో దూసుకు పోతున్నారు.అచ్చెన్న దూకుడుకు నియోజకవర్గంలో పూర్తిగా బ్రేకులు వేసే క్రమంలో దువ్వాడ సక్సెస్ అవుతోన్న పరిస్థితే ఉంది. ఏ చిన్న పని అయినా తన కనుసన్నల్లోనే జరగాలని ఆయన ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాజమహేంద్రవరం సిటీలో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని పక్కన పెట్టి ఆమె భర్త వాసుయే పెత్తనం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.కింజారపు ఫ్యామిలీ నుంచి ముగ్గురు గెలిచినా అధికార పార్టీ పగడ్బందీ ప్లాన్‌తో కింజరాపు హవాకు బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు చూపించినా.. ఇప్పుడు మాత్రం కింజరాపు ఫ్యామిలీ అగచాట్లు పడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇది .. వచ్చే మూడేళ్లలో ఎలా యూటర్న్ తీసుకుంటుందో చూడాలి.