శ్రీకాళహస్తి, శ్రీశైలం మరియు ద్రాక్షారామం అనే మూడు శివలింగాల క్షేత్రాల మధ్యన గల ప్రదేశాన్ని త్రిలింగ దేశమని, ఇక్కడ నివసిస్తున్న ప్రజలను త్రిలింగులని పిలిచేవారని పురాణాలలో పేర్కొన్నారు. ఉచ్చరణలో క్రమంగా మార్పు చెంది, త్రిలింగం కాస్త తెలుంగు గాను అదికాస్త తెలుగువారు గాను మారారాని పూర్వీకులు అభిప్రాయం.
త్రిలింగ దేశాన "పంచరామాలు" అనే ఐదు ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఉన్నాయి. అవి వరుసగా అమరావతి లోని అమరారామము, భీమవరం లోని సోమారామము, పాలకొల్లు లోని క్షీరారామము, తూర్పు గోదావరి జిల్లా లోని ద్రాక్షారామము మరియు సామర్లకోట లోని కుమారారామము గా ఉన్నాయి. ఒకానొక సమయంలో దేవతలకు మరియు రాక్షసులకు యుద్ధం జరుగుతున్న సమయంలో శివపార్వతుల పుత్రడైన కుమార స్వామి, వజ్రాంగుడనే రాక్షసుని కుమారుడైన తారకాసురుడి ని చంపి, అతని కంఠం లో ఉన్న అమృత లింగాన్ని తన ఆయుధంతో ఐదు ముక్కలుగా ఖండిస్తాడు. ఈ ఐదు భాగాలు ఐదు ప్రదేశాలలో ఒక్కొకటిగా పడతాయి. అలాపడిన ఆ ప్రదేశాలు నేడు పంచరామ క్షేత్రాలుగా పిలవబడుతున్నాయి.
అమరారామము
గుంటూరు జిల్లాలో గుంటూరు నగరానికి సుమారు 35 కి. మీ. దూరంలో కృష్ణా నదీ తీరమున వెలసిన అమరావతిలో అమరారామము క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం పంచరామాల్లో మొదటిది గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ గల స్వామి ని అమరేశ్వరుడు అని పిలుస్తారు. గర్భగుడి లో స్వామి వారి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ గర్భగుడి లో ఉన్న విగ్రహాన్ని తారకాసురుడిని వధించిన పిమ్మట తన కంఠం లోని శివలింగం చెల్లా చెదురు అవ్వగా అందులోని ఒక భాగాన్ని తీసుకొని ఇంద్రుడు ప్రతిష్టించాడని భక్తుల విశ్వాసం.
సోమారామము
పంచరమాలలో రెండవదైన సోమారామము రాజమండ్రి కి 59 కి.మీ. దూరంలో, విజయవాడకు 91 కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న గునిపూడి లో కలదు. ఇక్కడ స్వామి వారు సోమేశ్వరుని గా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే, మామూలు రోజుల్లో తెలుపు రంగు లో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితి కి వచ్చేస్తుంది. ఇక్కడ గల స్వామి వారిని చంద్రుడు ప్రతిష్టించినాడు.
క్షీరారామము
మూడవదైన క్షీరారామము రాజమండ్రి కి 72 కి. మీ. దూరంలో, విజయవాడకు 112 కి . మీ . దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో ఉంది. ఇక్కడ స్వామి వారు రామలింగేశ్వర స్వామి గా పూజలు అందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో ఉన్న లింగాన్ని స్వయాన శ్రీరాముడు ప్రతిష్టించాడని కొందరి వాదన. ఈ ఆలయానికి ఒక విశేషం ఉంది అదేమిటంటే ఆలయం 9 అంతస్తులలో ఉండి, రాజగోపురం 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. తెల్లగా ఉండే శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది.
ద్రాక్షారామము
పంచరామాలలో నాల్గవది అయిన ద్రాక్షారామము తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కి 47 కి. మీ. దూరంలో ఉన్న రామచంద్రాపురంలో ఉన్నది. ఇక్కడ దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేశాడు కనుకనే ఈ ప్రదేశాన్ని దక్షరామం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి భీమేశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ ఉన్న భీమేశ్వర లింగం 15 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఉండి, సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండు అంతస్తులలో ఉంటుంది కనుక స్వామివారికి అభిషేకాదులు పై అంతస్తు లో గల లింగ భాగానికి చేస్తారు.ఈ క్షేత్రం చాలా మహిమ కలది.
కుమార భీమారామము
రాజమండ్రి కి 47 కి. మీ. దూరంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా, సామర్లకోట రైల్వే స్టేషన్ కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పంచరామాల్లో చివరిదైన కుమార భీమారామము ఉంది. ఇక్కడ స్వామి వారిని కాల భైరవుడని పిలుస్తారు. ఇక్కడ సున్నపురాయితో తయారుచేయబడ్డ లింగం 60 అడుగుల ఎత్తులో ఉండి రెండంతస్తుల మండపంగా ఉంటుంది. ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు. ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినాన ఉత్సవాలు మిన్నంటుతాయి.
శివోహం..