YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలి మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలి                            మంత్రి హరీష్ రావు

కాళేశ్వరంలో భాగమైన అనంతగిరి, రంగనాయకి సాగర్,కొండపోచమ్మ సాగర్ పనుల్లో వేగం పెంచాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.రంగనాయక సాగర్  పనులు వేగవంతం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి కోరారు. సిద్ధిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి భూసేకరణ పనులు ఇరిగేషన్ ఈ.ఈ ఆనంద్ నిర్మాణ పనులను ఏజెన్సీ లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు. తొందరగా పని పూర్తి చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో అనంతగిరి ప్యాకేజీ రంగనాయక సాగర్ ప్యాకేజీ 11, మల్లన్న సాగర్ ప్యాకేజీ 12, కొండ పోచమ్మ సాగర్ ప్యాకేజీ 13, 14 నిర్మాణ పనుల పురోగతిని మంత్రి హరీశ్ రావు  సమీక్షించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, ఇరిగేషన్ సీ.ఈ హరిరాం, ఎస్.ఈ వేణు, సిద్ధిపేట, గజ్వేల్ ఆర్డీ.ఓలు ముత్యం రెడ్డి,విజయేందర్ రెడ్డి, పలు మండలాలకు చెందిన తహశీల్దార్లు, డీఎఫ్ఓ శ్రీధర్, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస చారి, ఇరిగేషన్ ఈ.ఈ ఆనంద్, రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ డీఈలు, ఏఈఈలు, ఆయా ప్రాంతాలలోని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర సిబ్బందిపాల్గొన్నారు.రంగనాయక సాగర్ ఎడమ, కుడి పిల్ల కాలువ నిర్మాణ పనులకు 435 ఎకరాలకు గానూ 85 ఎకరాల భూ సేకరణ మాత్రమే మిగిలి ఉన్నదని అన్నారు. ఆ భూ సేకరణను నాలుగు రోజులలో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను  మంత్రి ఆదేశించారు.  భూ సేకరణ చేపట్టిన ఆయా ప్రాంత నిర్వాసితులకు బోరు, బావులు, చెట్లు, బర్రెలు, గొర్ల షెడ్లకు సంబంధించిన పరిహార చెల్లింపులు త్వరితగతిన చేయించేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డికి మంత్రి సూచించారు. చిన్నకోడూర్ తహశీల్దారు పనితీరుపై మంత్రి హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో కలిసి ప్రాజెక్టు పనుల వేగవంతానికి కృషి చేయాలని, ఇందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.సిద్ధిపేట జిల్లాలో జలాశయాల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో ముంపునకు గురవుతున్న గ్రామ ప్రజలకు మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు మెగా 'జాబ్ మేళా'ను తలపెట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి  ప్రకటించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ చాంబర్ లో 'టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ హైదరాబాదు కన్సల్టెన్సీ ప్రతినిధి సందీప్ తో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారూ. సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి,  అనంతగిరి,  కొండపోచమ్మ,  మల్లన్నసాగర్, రంగనాయక జలాశయాలలో ముంపునకు గురవుతున్న గ్రామాలలోని యువత కోసం మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఆయా ముంపు ప్రాంతాలలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడమే కాకుండా, ముందుగానే 45రోజుల నుంచి 4నెలల పాటు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.  టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ద్వారా బేసిక్ ఇంగ్లీషు కమ్యూనికేషన్, వర్క్ ప్లేస్ రెడినెస్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడం, వ్యక్తిత్వ అభివృద్ధి, ఉద్యోగ అవసరమైన అన్ని రకాల శిక్షణలు ఇవ్వనున్నామని  'టాటా' కంపనీ ప్రతినిధి జిల్లా కలెక్టర్ కు వివరించారు. బ్యాంకింగ్, ఆటో మోబైల్ సెక్టార్, బీపీఓ-కాల్ సెంటర్, హోటల్ మేనేజ్ మెంట్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇతరత్రా వాటిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టు, శిక్షణతో పాటు ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆయా నిరుద్యోగ అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, ఇతరత్రా వసతిసౌకర్యం, భోజన సదుపాయాల కల్పన అంశాలపై చర్చించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక రూపంలో సమర్పించాలని టాటా కంపనీ ప్రతినిధికి కలెక్టర్ సూచనలు చేశారు. ఈ జాబ్ మేళాను త్వరలోనే నిర్వహించనున్నట్లు కలెక్టర్ మీడియా కు చెప్పారు. ఈ విషయంపై వారం రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్లు కలెక్టర్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

Related Posts