అనంతపురం, డిసెంబర్ 18,
అనంతపురం జిల్లా రాజకీయాల్లో వైసీపీ కొత్త తరహా రాజకీయాలకు తెరలేపిందా..? పరిటాల ఫ్యామిలీని రెచ్చగొట్టి రచ్చచేసేందుకు సిద్ధమైందా..? అందుకే ఆ పార్టీ నేతలు పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేశారా..? ఇప్పుడు ఈ ప్రశ్నలపై ఏపీ రాజకీయాల్లో విస్తృత చర్చసాగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పరిటాల కుటుంబం కొంత సైలెట్‌గానే ఉంటుంది.. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల శ్రీరాం ఓటమిపాలుకావటం, ఇటు టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆచితూచి రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిటాల కుటుంబానికి ఓ గుర్తింపు ఉంది. అభిమానులుసైతం భారీ సంఖ్యలోనే ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి మంచి పట్టుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నుంచి బరిలో నిలిచిన పరిటాల శ్రీరాం ఓడిపోయినా.. రాప్తాడుతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పరిటాల కుటుంబానికి మద్దతు దారులు భారీగానే ఉన్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబంపై ప్రజల్లో ఉన్న మద్దతును పూర్తిగా తుడిసివేసేందుకు వైసీపీ వ్యూహంగా పెట్టుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చసాగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తమ కుటుంబంపై కుట్రలు మొదలవుతాయని భావించిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాంలు రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీనికితో తమ వర్గీయులనుసైతం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టి రచ్చచేసేలా వైసీపీ ప్లాన్‌గా పెట్టుకున్నట్లు తెదేపా శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల వైసీపీ ఎంపీ మాధవ్ పరిటాల రవిపై అనుచిత వ్యాఖ్యలు చేయటమేనని తెదేపా శ్రేణులు, పరిటాల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలుచేస్తే పరిటాల అభిమానులు, తెదేపా శ్రేణులు రెచ్చిపోతారని, ఫలితంగా ఘర్షణలు సృష్టించారన్న పేరుతో పరిటాల వర్గీయులను, తెదేపా శ్రేణులను అరెస్టులు చేసి జైళ్లకు పంపించవచ్చనేది వైసీపీ ప్లాన్‌గా పలువురు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్లాన్‌ను ముందుగానే పసిగట్టిన పరిటాల సునీత, తెదేపా నేతలు ఆచితూచి మాట్లాడుతూ వస్తున్నారు. పరిటాలపై మాధవ్ చేసిన వ్యాఖ్యలను సునీత సున్నితంగా తిప్పికొట్టారు. అదే క్రమంగా పరిటాల అభిమానులు, తెదేపా శ్రేణులు ఆవేశాలకు గురికావొద్దని ఆమె సూచించారు. అయితే వైసీపీ ఎంపీ మాధవ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి, ఆయన కుటుంబం చేసిన అరాచకాల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని అన్నారు. పరిటాల కుటుంబం హయాంలో నియోజకవర్గాల్లో తాగునీటికి నోచుకోని గ్రామాలు చాలా ఉన్నాయని అన్నారు. కనీస అభివృద్ధి కూడా తెదేపా హయాంలో, సునీత మంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గాల్లో జరగలేదని అన్నారు. ఇలా వరుసగా వైసీపీ నేతలు ఆ పార్టీ ఎంపీ మాధవ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతుండటంతో పరిటాల వర్గీయులు రగిలిపోతున్నారట. మరి వైసీపీ వ్యూహాన్ని పరిటాల కుటుంబం, తెదేపా నేతలు ఏవిధంగా సమర్థంగా తిప్పికొడతారో వేచి చూడాల్సిందే.