హైదరాబాద్, డిసెంబర్ 18, సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ `లూసీఫర్` తెలుగు రీమేక్ లో నటించేందుకు మెగాస్టార్ చిరంజీవి సర్వసన్నాహల్లో ఉన్న సంగతి తెలిసిందే. `ఆచార్య` చిత్రీకరణ సాగుతుండగానే 153 వ సినిమాగా రానున్న ఈ మూవీ స్క్రిప్టును దర్శకుడిని ఫైనల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. వచ్చేనెల జనవరి 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈసినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “లూసీఫర్ సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యింది. `తనిఒరువన్` (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. రీమేక్ కథ ఓకే అయ్యింది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్ కెళతాం. ఫిబ్రవరి-మార్చి – ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో ఈ 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నాతో సినిమా చేయాలని వేచి చూస్తున్న చిరకాల సన్నిహితులు ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది“ అని తెలిపారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ-“మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన హిట్లర్ (ముత్యాల సుబ్బయ్య దర్శకుడు) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం అదృష్ఠం దక్కడం పూర్వజన్మ సుకృతం. ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఎన్వీ ప్రసాద్ గారు నిర్మాతగా రాజీ లేకుండా తెరకెక్కించనున్నారు“ అని తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్రసాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా గురించి నిర్మాత ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. “చిరంజీవి గారి సినిమాని మోహన్ రాజా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారితో పాటుగా మా అందరికీ నచ్చేలా మార్పులు చేర్పులతో ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్టును మలిచి మోహన్ రాజా మెప్పించారు. బాస్ తో సినిమా అంటేనే కొత్త ఉత్సాహం అందరిలో నెలకొంది. రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం“ అని తెలిపారు.