న్యూఢిల్లీ డిసెంబర్ 18
వచ్చే ఏడాది జనవరిలో కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు టీకా పంపిణీకి సిద్ధమవుతున్నాయి. కొవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్రం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు జాతీయ మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి దశలో భాగంగా 30 కోట్ల మంది భారతీయులకు కొవిడ్ టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే బీహార్, కేరళ వంటి రాష్ర్టాలు కొవిడ్ టీకాను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ఆ అధికారి, మిగతా రాష్ర్టాలు కూడా త్వరలోనే అలాంటి ప్రకటన చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ప్రపంచ బ్యాంకుల నుంచి కేంద్రం అప్పు తీసుకునేందుకు సుముఖంగా లేదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జీఏవీఐ నేతృత్వంలోని కొవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్లాన్ కింద భారతదేశానికి మద్దతు ఉందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 టూల్స్(యాక్ట్) యాక్సిలరేటర్ ఫండ్ ద్వారా.. పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ అందించడమే ఈ ఒప్పంద లక్ష్యమని వివరించారు. కొవిడ్ టీకా పంపిణీకి సంబంధించి జీఏవీఐ భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతుందని తెలిపారు. నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్స్ లెక్కల ప్రకారం.. మొదటి దశలో కోటి మంది హెల్త్ కేర్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరిలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్‌తో పాటు 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్, అత్యవసర కార్మికులు, 27 కోట్ల మంది వృద్ధుల(50 ఏళ్లకు పైబడినవారు)కు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 27 కోట్ల మందిలో అత్యధికులు డయాబెటిస్, గుండె సమస్యలతో పాటు ఇతర వ్యాధులకు ప్రభావితమైన వారున్నారు.