YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నఅన్యాయానికి నిరసనగా... సిఎం చంద్రబాబు‘ధర్మ పోరాట దీక్ష’

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నఅన్యాయానికి నిరసనగా... సిఎం చంద్రబాబు‘ధర్మ పోరాట దీక్ష’

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న  అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన జన్మదినం రోజున ‘ధర్మ పోరాట దీక్ష’ పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు  ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి ఏడింటి వరకు కొనసాగనుంది.ఉదయం దీక్షా స్థలికి చేరుకున్న చంద్రబాబు ముందుగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్‌ చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’ ఆలపించారు. దీక్షలో చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేశ్‌, కొల్లు రవీంద్ర, ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల వీంద్రకుమార్‌, కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య  సమరయోధులు పావులూరి శివరామకృష్ణ చంద్రబాబుకు నూలుపోగు దండ వేసి అభినందించారు.ముఖ్యమంత్రి వేదికపైకి రాగానే తితిదే, దుర్గగుడికి చెందిన వేదపండితులు, క్రైస్తవ, ముస్లిం మతపెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. మాజీ సైనికులు ముఖ్యమంత్రిని కలసి సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఏడింటికి దీక్ష విరమించాక ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీక్షకు సంఘీభావంగా హాజరైన వివిధ పార్టీలు, సంఘాల నాయకులతో మాట్లాడిస్తారు.విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చేస్తున్న పోరాటంలో భాగంగా చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించకుండా, దీక్షల ద్వారా అందరూ కేంద్రంపై ధర్మాగ్రహం ప్రకటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఒక నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం పుట్టిన రోజున నిరాహారదీక్ష చేయడం ఇదే ప్రథమం. 68ఏళ్ల  వయసులోనూ ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ముఖ్యమంత్రికి సంఘీభావంగా తెదేపా శ్రేణులు, వివిధ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తున్నాయి. ఏ జిల్లాకు చెందిన మంత్రుల్ని ఆ జిల్లాలోనే దీక్షల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు సూచించారు.దీక్ష నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు లేఖ రాశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేస్తున్నాను’’ అని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పోరాటానికి కలసి రావాలని, దీక్షలో పాల్గొనాలని కోరుతూ అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, సంస్థలకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళావెంకటరావు లేఖలు రాశారు. వైకాపా, భాజపా, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలు సహా అన్ని పార్టీలకూ, సంఘాలకు ఈ లేఖలు వెళ్లాయి. ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్లుచేసి సమాచారం అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వాణిజ్య సంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ సంస్థలు, యూనియన్లు ముఖ్యమంత్రి దీక్షకు మద్దతు ప్రకటించాయి. రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున దీక్షకు హాజరుకానున్నారు. ధర్మ పోరాట దీక్షకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదికను ముఖ్యమంత్రి సహా 250మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి మొదటి వరుసలో వేదిక మధ్యలో, కాస్త ఎత్తైన ప్రదేశంపై కూర్చున్నారు. మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ దీక్షకు సుమారు లక్షా పాతికవేల మంది హాజరవుతారని అంచనా వేశారు. కృష్ణా జిల్లా మొత్తం, గుంటూరు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి దీక్షకు ప్రజలు హాజరుకానున్నారు. ఉదయం 6 నుంచి 10-30 వరకు విజయవాడ వాసులు, ఆపై దశలవారీగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు  దీక్షలో పాల్గొంటారు. వేసవి తీవ్రత దృష్ట్యా స్టేడియం మొత్తం షామినాయానాలు వేశారు. 10వేల మంది కూర్చునేందుకు కుర్చీలు వేశారు. తాగునీరు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అత్యవసర సేవలందించేందుకు వైద్య సిబ్బందిని, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. స్టేడియంలో భారీ ఎల్‌ఈడీ తెరలు అమర్చారు. ‘‘నవ్యాంధ్రప్రదేశ్‌ నమ్మకాన్ని కేంద్రం నట్టేట ముంచింది. ఐదుకోట్ల ప్రజల్ని నిలువునా దగాచేసింది. చెంబుడు నీళ్లు, చారెడు మట్టి మొహాన కొట్టి దారుణంగా అవమానించింది. తెలుగువాడి గుండెను రగిలించింది. ఇలా అందరి ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదన తనదిగా భావించి జనం తరపున ముఖ్యమంత్రి ఉద్యమ శంఖం పూరించారు’’ అని సీఎం కార్యాలయం పేర్కొంది. ‘‘రాష్ట్రం పట్ల కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణితో విసిగిపోయిన ముఖ్యమంత్రి పోరుబాట పట్టారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని తన దీక్ష ద్వారా నిలదీయనున్నారు. షాంఘై కంటే ఆరింతలు, దిల్లీ కంటే రెండింతలు పెద్దగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి దగ్గర్లో ధోలేరా నగరాన్ని 2.30లక్షల ఎకరాల్లో నిర్మిస్తానని ఘనంగా ప్రకటిస్తున్న ప్రధానికి మనం 33వేల ఎకరాల్లో రాజధాని నిర్మించుకుంటామంటే అపహాస్యంగా ఉంది. ధోలేరాకు ఇప్పటికే రూ.4,100 కోట్లు ఇచ్చిన కేంద్రం అమరావతిని చిన్నచూపు చూస్తోంది. ఈ వివక్షను దేశమంతటికి అర్ధమయ్యేలా చాటి చెప్పేందుకే ముఖ్యమంత్రి దీక్ష చేపడుతున్నారు’’ అని వెల్లడించింది.ర్మపోరాట దీక్షకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా విజయవాడ నగరం ఇందిరాగాంధీ మున్సిపల్‌ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. గురువారం నాడే సభా ప్రాంగణం, దీక్షా స్థలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.సీఎం పోరాట దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చే వాహనాల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. మొత్తంగా 3 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. దీక్షా ప్రాంగణం వద్ద దాదాపు వెయ్యి మంది పోలీసులను మోహరించారు. నగరంలోనూ శివారు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ మళ్లింపులకు 2వేల మందిని నియమించారు. బందోబస్తులో పాల్గొంటున్న పోలీసులతో నగర పోలీసు కమీషనర్‌ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. నియమ నింబధనలను, ప్రొటోకాల్‌ తీరును వివరించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 6 గంటలకు బందరు రోడ్డులో వచ్చిన వాహనాలు ఆర్టీఏ జంక్షన్‌ నుంచి రెడ్‌ సర్కిల్‌ మధ్య నిలుపుకొని పశ్చిమ గేటు ద్వారా ప్రాంగణంలోకి వెళ్లాలని నిర్ణయించారు. వారిని దించిన తర్వాత వాహనాలను రెడ్‌ సర్కిల్‌, శిఖామణి సెంటర్‌ మీదుగా పార్కింగ్‌ ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. సిద్ధార్థ గ్రౌండ్‌లు, లయోలా కళాశాల గ్రౌండ్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణ ప్రాంతాలను పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో తూర్పు గేటు వద్ద కార్యకర్తలను ఎక్కించుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను రెడ్‌ సర్కిల్‌ వరకు నిలుపుకొని కార్యకర్తలను దించి తిరిగి పుష్పా హోటల్‌ సెంటర్‌ నుంచి సీతారాంపురం చేరుకొని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో పార్కింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి తిరిగి వెళ్లేటప్పుడు పడవలరేపు, చుట్టుగుంట, విశాలాంధ్రరోడ్డు, శిఖామణి సెంటర్‌, వాటర్‌ ట్యాంకు రోడ్డులో ప్రవేశించి తూర్పుగేటుకు చేరుకొని వారిని ఎక్కించుకొని వెళ్లాల్సి ఉంటుంది.  మధ్యాహ్నం 1.30గంటలకు వచ్చే వాహనాలు పశ్చిమ గేటు వద్ద దింపి రెడ్‌సర్కిల్‌ మీదుగా పీడబ్య్లూడీ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, రైతుబజారు సందు, ఆకాశవాణి రోడ్డు, కృష్ణలంక ఫీడర్‌ రోడ్డు మీదుగా వెళ్లి పార్కింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం తూర్పుగేటు వరకు చేరుకొని వారిని ఎక్కించుకొని గమ్యస్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటకు కృష్ణా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు మాత్రం ఆర్టీఏ జంక్షన్‌ చేరుకొని కార్యకర్తలను దించి వేయాలి. పశ్చిమ గేటు ద్వారా లోపలికి ప్రవేశిస్తారు. ఈ వాహనాలు అన్నీ బీఆర్‌టీఎస్‌ రహదారి పై పార్కింగ్‌ చేసుకోవాల్సి ఉంది. కొత్త వంతెన మీదుగా చేరుకుంటాయి. తిరిగి శిఖామణి సెంటరు ద్వారా తూర్పు గేటు వద్దకు చేరుకొని కార్యకర్తలను ఎక్కించుకొని గమ్యస్థానాలకు వెళతాయి. సాయంత్రం 4గంటలకు ఆతర్వాత వచ్చే ఉద్యోగ సంఘాలు ఇతర సంఘాల నుంచి వచ్చే సంఘీభావం ప్రకటించే వారి వాహనాలను పశ్చిమ గేటు వద్ద దింపి పీడబ్య్లూడీ మైదానం రైతుబజారు, రాష్ట్ర అతిథి గృహం ప్రాంగణాల్లో పార్కింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో తూర్పు గేటు వద్దకు వెళ్లి పికప్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గుంటూరు,  ఇతర ప్రాంత వాసులు ఉదయం 10గంటల ప్రాంతంలో రావాల్సి ఉంటుందని నేతలు ఆదేశాలు ఇచ్చారు. నాలుగు స్లాట్‌లుగా సమయం విభజించి రద్దీ లేకుండా చూడాలని పోలీసులు ఏర్పాటు చేశారు.

Related Posts