YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకల్ కాదు... సార్వత్రికే కిక్కు

లోకల్ కాదు... సార్వత్రికే కిక్కు

విజయవాడ, డిసెంబర్ 19 
ఎన్నికలు అంటే ఎన్నికలే. ఎక్కడైనా ఓట్లేసేది ప్రజలే. అందువల్ల ఏదో విధంగా ప్రజాభిప్రాయం బయటపడుతుంది. నిజంగా వైసీపీ మీద అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటే, టీడీపీ మీద పీకలవరకూ ప్రేమ కూడా ఉంటే కచ్చితంగా జనం ఓటేస్తారు. సైకిల్ యమ స్పీడ్ గా పరుగులు తీసే ఛాన్సుంది. కానీ చంద్రబాబుకు ఈ అరకొర ఎన్నికలు అంటే అసలు ఇష్టం లేదులా ఉంది. ఆయన మొదటి నుంచి ఒక్కటే పాట పాడుతున్నారు. ఏకంగా ఏపీ అసెంబ్లీకే ఎన్నికలు కావాలని పట్టుబడుతున్నారు. ప్రతి సమావేశంలో ఎన్నికలకు సిద్దం కావాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు.లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని ఈ మధ్య వరకూ చంద్రబాబు, అచ్చెన్నాయుడు గట్టిగానే డిమాండ్ చేసారు. పైగా జగన్ కి ఎన్నికలు అంటే భయం అన్న కొత్త థియరీని కనిపెట్టారు కూడా. ఇలా ఎన్నికలు పెట్టండి అలా అన్ని సీట్లూ కొట్టుకువస్తామంటూ బీరాలూ పలికారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడో గుండెల్లో గుబులు రేగుతోందిలా ఉంది. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా ఎన్నికలకు వెళ్తే ఫుల్ హ్యాపీ కాదా. ఆయన ఎటూ వైసీపీ మీద గుర్రుగా ఉన్నారు. ఏ అక్రమాలు జరగకుండా చూస్తారు. అపుడు పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు. సీట్లు గెలవవచ్చు కదా. అయినా కూడా ఎందుకో టీడీపీకి నూటొకటి కొడుతున్నట్లుగా ఉంది మరి. అందుకే లోకల్ ఫైట్ మీద ఆసక్తి లేదు అనేస్తున్నారు.ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న తిరుపతి లోక్ సభకు త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. పోనీ అక్కడ ట్రై చేయవచ్చు కదా. ఎటూ జగన్ పట్ల జనంలో నిండా వ్యతిరేకత ఉంది కదా. ఉఫ్ అని ఊదేస్తే ఫ్యాన్ పార్టీ అలా పక్కకు పోతుంది. ఎంచక్కా పసుపు జెండా రెపరేపాలడుతుంది కదా. మరి తిరుపతి అభ్యర్ధిని కూడా అందరి కంటే ముందే ప్రకటించి కొంత హడావుడి చేసిన చంద్రబాబుకు తిరుపతి ఉప ఎన్నిక కూడా హుషార్ తేలేకపోతోందిట. ఇలాంటి ఎన్నికలు వద్దు పెడితే ముఖ్యమంత్రి సీటుని పట్టేసే ఎన్నికలే పెట్టాలని చంద్రబాబు గట్టిగా కోరుతున్నారు.సార్వత్రిక ఎన్నికలు జరిగితేనే టీడీపీ విజయం సాధిస్తుంది అని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారో అర్ధం కాదు, మరి ఈ స్థానిక ఎన్నికల్లో జనం పూర్తిగా వైసీపీక ఓటు వేస్తారని ఏదైనా అంచనాకు చంద్రబాబు వచ్చి ఉండాలి. లేక జగన్ వేవ్ ఇంకా ఉందని బలంగా నమ్ముతూ అయినా ఉండాలి. మరి లోకల్ బాడీస్ లో కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో కానీ గెలవలేని టీడీపీ మొత్తం 175 అసెంబ్లీ సీట్లూ, 25 ఎంపీ సీట్లు టీడీపీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారో కదా. అంటే మొత్తం మీద ఎన్నికలు జరిగితే సీఎంగా తాను జగన్ కంటే బెటర్ అని చెప్పేసి ఓట్లు తెచ్చుకుందామనా లేక సార్వత్రిక ఎన్నికల్లో జగన్ బలం తగ్గిపోతుందనా. మరి ఏమో తెలియదు కానీ బొత్తిగా లాజిక్ లేని విధంగా జమిలి ఎన్నికలు అర్జంటుగా పెట్టమంటూ చంద్రబాబు తెగ డిమాండ్ చేస్తున్నారు. అయినా జనంలో అంత ఆదరణ ఉంటే ఏ ఎన్నిక అయినా ఏముంది బాబూ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద చంద్రబాబుకు జమిలి ఎన్నికల ఫీవర్ పట్టుకున్నట్లుంది.

Related Posts