YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొనుగోలుతో కోతలు

కొనుగోలుతో కోతలు

వేసవి కాలం వచ్చేసింది. విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోతోంది. ఈ కాలమంతా కోతలు లేకుండా చేసి, ప్రజల ఉక్కపోతలను తగ్గించాలంటే విద్యుత్‌ 24గంటలపాటు అందుబాటులో ఉండాలి. అయితే, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర విద్యుత్తు సంస్థల మాట ఒక్కటే. కరెంటును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేద్దాం అనే తీరులో వ్యవహరిస్తున్నాయి. దీంతో సరఫరాకు, డిమాండ్‌కు మధ్య సమన్వయం చెదిరిపోయి.. పల్లెల్లో అనధికార కోతలు మొదలయ్యాయి. కొన్ని గ్రామాల్లో ప్రతి రెండో శనివారం పగటి పూట ఆరు గంటల పాటు కోతను విధిస్తున్నారు. అడపాదడపా సాంకేతిక కారణాలు సాకుగా గంట నుంచి రెండు గంటల సేపు సరఫరాను నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్తును అమలు చేస్తున్న తరుణంలో కోతలు మొదలు కావడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి, వాతావరణ శాఖ అందించే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వేసవి తీవ్రతను అంచనా వేసి విద్యుత్తు డిమాండ్‌ ఎంత పెరుగుతుందో జనరేషన్‌ కార్పొరేషన్‌ ఉత్పత్తిపై దృష్టి సారించాలి. కానీ, దాహం వేస్తుందని, నూతిని తవ్వే చందాన జెన్కో ఈ ముందస్తు ప్రణాళికలను రూపొందించడంలో వైఫల్యం చెందుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఈ నెల తొమ్మిదో తేదీన ఇంధన శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు సమీక్ష నిర్వహించారు. డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా 400 మెగావాట్ల విద్యుత్తును బయట నుంచి కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు. దీనిపై ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జెన్కో థర్మల్‌ కేంద్రాలను బ్యాకింగ్‌ డౌన్‌ చేస్తూ బయట నుంచి కొనుగోలు చేయడం ఏమిటని నిలదీశారు. జెన్కో సంస్థల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 6,050 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్‌ విద్యుత్కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నీ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తే బయట నుంచి విద్యుత్తును కొనుగోలు చేయనవసరం లేదు.

హిందూజాకు చెందిన రెండు యూనిట్లలో 1,040 మెగావాట్లు ఉత్పత్తి చేసే వీలుంది. అయితే.. ఈ విద్యుత్కేంద్రం నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయడం ద్వారా డిస్కమ్‌లను నష్టాల్లోకి నెట్టవద్దని, వినియోగదారులపై చార్జీల భారాన్ని వేయవద్దంటూ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీ జెన్కోకు చెందిన రెండు యూనిట్లలో 1,600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. రాయలసీమ థర్మల్‌ కేంద్రం సామర్థ్యం 1,650 మెగావాట్లు కాగా..ఈ ప్లాంటులో ప్రస్తుతం 688 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. విజయవాడ థర్మల్‌ విద్యుత్కేంద్రంలోని 1,760 మెగావాట్లకు గాను 1,227 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఉత్పత్తిని పెంచాలంటే సరిపడా బొగ్గు సరఫరా లేదని జెన్కో ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు బొగ్గు సరఫరా ఎలా జరుగుతోందన్న ప్రశ్నకు సంబంధిత వర్గాల నుంచి సమాధానం లేదు.

Related Posts