నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది జీతాల సమస్య, జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తీరుకు నిరసనగా శనివారం నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 24 గంటల నిరవధిక నిరసన ధర్నా ప్రకటించారు. రాష్ట్రము మొత్తం వైద్యులకు ఎంతైతే జీతం ఇస్తున్నారో నెల్లూరులో కూడా అదే జీతం ఇస్తామని, రెండు రోజులలోపల ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద గౌరవంతో ధర్నాను విరమిస్తున్నట్లు డాక్టర్లు సిబ్బంది తరఫున ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలోని 12 జిల్లాలో 70 వేల రూపాయలు జీతం జమఅవుతుంటే, నెల్లూరులో మాత్రం 50 వేల రూపాయల జీతం ఇస్తాం, ఒప్పుకొని తీరాలి అని హెచ్చరిస్తున్న జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తీరును చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అన్నారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలుచేస్తుంటే, మరోపక్క జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి లాంటి కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనిచూస్తే స్థానిక ఎమ్మెల్యే గా చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు.
పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.