YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నుంచి వలసలు కొనసాగుతాయా...?

టీడీపీ నుంచి వలసలు కొనసాగుతాయా...?

రాజకీయ నాడీ కేంద్రమైన విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. ముఖ్యంగా విజయవాడ తూర్పులోని రాజకీయ మార్పులు ఆసక్తిగొలుపుతున్నాయి. రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని పట్టి చూపించే నియోజకవర్గంగా పేరున్న విజయవాడ తూర్పులోని రాజకీయ పరిణామాలపై వివిధ పార్టీలు దృష్టి సారించాయి. అసలు తూర్పులో ఏం జరుగుతుంది.?

విజయవాడ తూర్పు నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున వంగవీటి రాధ.. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ.. తెలుగుదేశంపార్టీ నుంచి గద్దె రామ్మోహన్‌ బరిలో ఉన్నారు. ఈ పోరులో రామ్మోహన్‌ విజేతగా నిలిచారు. ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సీట్లు ఈ నియోజకవర్గం నుంచే లభించాయి. అప్పట్లోనే ఎమ్మెల్యేగా ఉన్న యలమంచిలి రవి కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంపార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున యలమంచిలి రవి గెలుపొందారు. అయితే పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేయడంతో రవి కూడా కాంగ్రెస్‌లోకి వచ్చారు. అప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న నెహ్రూకు.. రవికి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశంపార్టీలో చేరిన రవి అప్పుడు పోటీ చేసిన గద్దె రామ్మోహన్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయనను తెలుగుదేశంపార్టీ నేతలు కలుపుకువెళ్లలేదు. ఈలోపు మాజీమంత్రి దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు అవినాశ్‌ టీడీపీలో చేరిపోయారు. నెహ్రూతో పాటు అనేకమంది ఆయన అనుచరులు, మాజీ కార్పొరేటర్లు టీడీపీలోకి వచ్చేశారు.

ఈ నేపథ్యంలోనే యలమంచిలి రవి రెండుమూడు పర్యాయాలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.. అయితే అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. ఈలోపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు రవికి టచ్‌లోకి వచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్‌ ఇస్తామని జగన్‌తో హామీ ఇప్పించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేనిలు యలమంచిలి రవిలతో మాట్లాడారు. రవిని వెంటపెట్టుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లారు కేశినేని నాని. మ్యాటర్‌ అంతా తెలుసుకున్న చంద్రబాబు ఓ మూడు నెలలు ఓపికపట్టాలని రవికి సూచించారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో రవి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అట్టహాసంగా ఆయన జగన్‌ పార్టీలో చేరిపోయారు. రవి నిజాయితీపరుడు.. ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడే తత్వం ఆయనది. ఇటీవల కొన్ని ఫంక్షన్‌లకు వెళ్లిన రవిని కొందరు తెలుగుదేశం మంత్రులు బాధించేటట్టు మాట్లాడారట! ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నావని ప్రశ్నించడం రవిని అమితంగా బాధించింది.

తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కూడా నిజాయితీపరుడు... ప్రతి రోజూ నియోజకవర్గంలో ఉదయం.. సాయంత్రం పర్యటించడంతో పాటు సొంత డబ్బుతో పేదవాళ్లకు కుట్టుమిషన్లు.. తోపుడుబండ్లు.. ఇస్ర్తీ పెట్టెలు వంటి స్వయం ఉపాధి పథకాలను అందచేస్తుంటారు. రామ్మోహన్‌ నియోజకవర్గంలో పార్టీపరంగా పటిష్టంగా ఉన్నప్పటికీ యలమంచిలి రవిని పార్టీ నుంచి వెళ్లకుండా ఆపి ఉండాల్సిందని టీడీపీలోని కొంతమంది నేతలు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగితే ప్రతి ఓటూ కీలకంగా మారనుంది. 2009లో కూడా త్రిముఖ పోటీ జరిగింది. దేవినేని నెహ్రూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగితే.. గద్దె రామ్మోహన్‌ టీడీపీ తరఫున పోటీలో నిలిచారు. ఇక యలమంచిలి రవి పీఆర్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇందులో రవి విజయం సాధించారు. ప్రస్తుతం రవి టీడీపీకి రాజీనామా చేసి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లడం వల్ల కొన్ని ఓట్లను కోల్పోయే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. అయితే టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని మరికొందరు అంటున్నారు. అవమానాలు.. వ్యంగ్య వ్యాఖ్యానాలు... గుర్తింపు లేకపోవడం వంటివి రవిని ఎంతో కష్టపెట్టాయి.. పార్టీ సభ్యుడిగా గుర్తించడం లేదన్న ఆవేదనతోనే టీడీపీని వీడానంటూ రవి చేసిన వ్యాఖ్యలు టీడీపీలోని కొంతమంది నేతలకు జీర్ణం కావడం లేదు. అయితే రవి వెంట ఆయన అనుచరులంతా వెళతారా? లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది..

Related Posts