విజయవాడ, డిసెంబర్ 21,
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తన దారి తాను చూసుకునే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీలో అయితే కేశినేని నాని కంఫర్ట్ గా లేరు. ఆయన బలవంతం మీద పార్టీలో ఉన్నట్లే కనిపిస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకూ ఆయన టీడీపీ లో కొనసాగే అవకాశముందని, ఆ తర్వాత పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే తన కుమార్తెను మేయర్ చేయాలని కేశినేని నాని భావిస్తున్నారు.అందుకే మున్సిపల్ ఎన్నికల వరకూ వెయిట్ చేయాలని కేశినేని నాని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ సమావేశాల కోసం విజయవాడ వచ్చినప్పుడు కూడా కేశినేని నాని దూరంగా ఉన్నారని తెలిసింది. నాని కూడా చంద్రబాబును కలిసేందుకు పెద్దగా ప్రయత్నాలు ఏమీ చేయక పోవడం విశేషం. కేశినేని నాని ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.తనకంటూ ఒక క్యాడర్ ను కేశినేని నాని రూపొందించుకుంటున్నారు. తానే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఫోకస్ అవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఎక్కువగా పర్యటనలు చేస్తున్నా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తన క్యాడర్ నే ఆయన ఆహ్వానిస్తున్నారని చెబుతున్నారు. టీడీపీలో తనకు ప్రాధాన్యత లభించకపోవడంతో పాటు తాను వ్యతిరేకించే వారికి చంద్రబాబు పెద్దపీట వేయడాన్ని కూడా కేశినేని నాని జీర్ణించుకోలేకపోతున్నారట.అందుకే ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వీడే అవకాశముంది. ఆయన బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకు పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. రెండోసారి తన గెలుపు స్వశక్తితోనేనని కేశినాని నాని తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారట. వైసీపీ ప్రభంజనం వీచినా తాను గెలవడానికి తన సొంత ఇమేజ్ కారణమని చెబుతుండటంతో పాటు, టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఈ అనుమానాలను రేకెత్తిస్తుంది. మొత్తం మీద కేశినేని నాని మున్సిపల్ ఎన్నికల తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశముందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.