YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి పాదయాత్ర.. సారథి ఎవరైనా పాదయాత్ర మాత్రం పక్కా

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి పాదయాత్ర..  సారథి ఎవరైనా పాదయాత్ర మాత్రం పక్కా

హైదరాబాద్ డిసెంబర్ 21 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరంలో మహా పాదయాత్ర చేపట్టే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీ నేతలు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని, వారికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో ప్రజల్లో అలాంటి నమ్మకాన్ని కలిగించడానికి, అధికారం వైపునకు అడుగులు వేయడానికి విస్తృతంగా పాదయాత్రలు చేపట్టాలన్న అభిప్రాయాలు పార్టీలో బలపడ్డాయి.అధికారంలోకి రావడానికి పాదయాత్రనే నేతలు సెంటిమెంటుగా భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా అధిష్ఠానం ఎవరిని నియమించినా.. రానున్న మూడేళ్లూ రాష్ట్రాన్ని చుట్టి రానున్నట్లు చెబుతున్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్‌  బలహీన పడడానికి వరుస ఎన్నికల్లో ఓటమితోపాటు నేతలు ప్రజలతో మమేకం కాకపోవడమూ కారణమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.వాస్తవానికి ప్రజల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతానని ఎంపీ రేవంత్‌రెడ్డి ఇప్పటికే పార్టీ నుంచి అనుమతి కోరారు. జీహెచ్‌ఎంసీ సమస్యలపై తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పరిధిలో యాత్ర చేపట్టడానికి సన్నాహాలు కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్కం ఠాగూర్‌ నియామకం జరగడం, దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నేతలందరినీ అధిష్ఠానం అక్కడే మోహరింపజేయడం వంటి కారణాలతో రేవంత్‌ తన యాత్రను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.టీపీసీసీకి నూతన అధ్యక్ష రేసులో ప్రధానంగా ఉన్న రేవంత్‌రెడ్డి.. కొత్త ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అధిష్ఠానం ఆయన్నే నూతన సారధిగా నియమించిన పక్షంలో ఈ యాత్రల్లో కాంగ్రెస్‌ పార్టీ విధానం, పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తుందీ అన్నది ఆయన ప్రజలకు వివరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ రేసులో ప్రధానంగా ఉన్న మరో నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆయన బాహాటంగానే ప్రకటించారు. ఇక టీపీసీసీ అధ్యక్ష పీఠం తనకు అప్పగించాలని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే మెడిసిన్‌ తన వద్ద ఉందంటూ అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం రైతు సమస్యలపై తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. సంగారెడ్డి నుంచి ఆదిలాబాద్‌ వరకూ పాదయాత్ర చేపడతానని, ఈ యాత్రల్లో రైతులను కలిసి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటానని, వాటిని శాసనసభలో లేవనెత్తుతానని అన్నారు.  వీరితోపాటు పార్టీలోని మరికొందరు నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి యాత్రలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండి.. 2004లో తిరిగి అధికారంలోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పాదయాత్రనే కారణమని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అలాగే 2014 నుంచీ అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకూ పాదయాత్రను సెంటిమెంటుగా చూస్తున్నారు.  రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ దూసుకువస్తున్న నేపథ్యంలో 2023 ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి చావో.. రేవో అన్నట్లుగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం నుంచి కాంగ్రెస్‌ పాదయాత్ర సీజన్‌ మొదలు కానుందని చెబుతున్నారు..  

Related Posts