హైదరాబాద్ డిసెంబర్ 21
రాష్ట్రంలో 8 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంటను ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు ప్రశంసించారు. రాబోయే నాలుగేండ్లలో ఎడిబుల్ ఆయిల్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. అమీర్‌పేట గ్రీన్ పార్క్ హోటల్‌లో నాబార్డ్ డీడీఎంల జోనల్ సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీజీఎంలు వైకే రావు, జన్నవార్, హైదరాబాద్ సీజీఎం ఓపీ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలు అందించడమే లక్ష్యంగా నాబార్డ్ - ఎస్బీఐ మధ్య ఒప్పందం కుదిరింది. తమ సంస్థాగత రుణాలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్ళాలన్నది ఈ ఒప్పంద లక్ష్యం. ఒప్పందం అనంతరం నాబార్డు చైర్మన్ గోవిందరాజులు మాట్లాడుతూ.. ఆత్మ నిర్భర్ భారత్ కాదు ఆత్మ నిర్బర్ కిసాన్ రావాలన్నారు. తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వ పథకాలతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు తగిన భూములు ఉన్నాయి. ఈ సాగుతో ఉపాధితో పాటు రాష్ర్టానికి కూడా ఆదాయం పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో దేశానికి ఆయిల్ ఉత్పత్తులను అందించే రాష్ర్టంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు. తెలంగాణ డీసీసీబీలు దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలోని డీసీసీబీలు దేశానికి ఆదర్శమని గోవిందరాజులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న డీసీసీబీల విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై గత 30 సంవత్సరాల నుంచి ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత వ్యవసాయంపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా ఉపయోగకరమైన నిర్ణయం అని కొనియాడారు. రానున్న రోజుల్లో ఇది దేశవ్యాప్తంగా అమలు కావాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలు పండించాలి.. దీంతో రైతులకు ,వినియోగదారులకు ఉపయోగం ఉంటుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌కు నాబార్డ్ బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ చాలా అవసరం.. దీంతో వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని గోవిందరాజులు పేర్కొన్నారు.