YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డకు చెక్...

నిమ్మగడ్డకు చెక్...

విజయవాడ, డిసెంబర్ 22, 
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు. ఇందుకు ప్రభుత్వం సహకరించకపోవడమే ప్రధాన కారణం. మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. జనవరిలోగా ఓటర్ల జాబితా సవరణను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇందుకు సిద్ధంగా లేదు. ఇందుకు కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం చూపుతుంది.మరోవైపు హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి అభ్యంతరాలేంటని ప్రశ్నిస్తుంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తికావస్తోంది. అక్కడ స్థానికసంస్థల ఎన్నికల తర్వాత కూడా కరోనా వైరస్ పెద్దగా విజృంభించలేదు. కేసుల సంఖ్య పెరగలేదు. దీనిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదాహరణగా చూపుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని ఇబ్బందులు ఇక్కడ ఎందుకని ఆయన తరచూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.అయితే తాజాగా మరో వార్త ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. జనవరి పదిహేను నుంచి మార్చి పదిహేను వరకూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉంటుందని వైద్య నిపుణులు చెప్పారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేసిన ప్రకటన ప్రభుత్వ వాదనకు అనుకూలంగా మారింది. అనేక దేశాలు, భారత్ లోని ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ను ఈ సందర్భంగా వైద్య నిపుణులు ఉదహరిస్తున్నారు.అంటే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే సెకండ్ వేవ్ దృష్ట్యా కరోనా తీవ్రత మరింత పెరుగుతుందన్న ప్రభుత్వ వాదనకు ఇప్పుడు బలం చేకూరినట్లయింది. ఇప్పటికీ ఏపీలో రోజుకు సగటున 600 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు తీర్పు చెప్పినా వైద్య నిపుణుల అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. మార్చి వరకూ ఎన్నికలు జరగకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆశలు నెరవేరనట్లే. మరి తాజాగా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేస్తారో చూడాలి.

Related Posts