న్యూఢిల్లీ, డిసెంబర్ 22,
సరిహద్దులను శత్రు దుర్బేధ్యంగా తీర్చి దిద్దేందుకు భారత్ గట్టి చర్యలు తీసుకుంటోంది. చైనా, పాకిస్థాన్ ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తమవుతోంది. అడుగడుగునా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతోంది. శత్రువును నిలువరించేందుకు, సరిహద్దు దాటేందుకు అవకాశం ఇవ్వకుండా అన్నివిధాలా ముందుకు సాగుతోంది. దాయాది దేశమైన పాకిస్థాన్ తో నిత్యం సమస్యే. నియంత్రణ రేఖ (ఎల్ ఓ సీ- లైన్ ఆఫ్ కంట్రోల్) వద్ద అది రోజూ కాల్పులకు దిగుతుంటోంది. వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వద్ద చైనా తరచూ చొరబాట్లకు పాల్పడుతుంటోంది. ఈ రెండు దేశాల ఆట కట్టించేందుకు భారత్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేపట్టింది.శత్రువులను నిలువరించే చర్యల్లో భాగంగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ మంత్రిత్వ శాఖ దీటుగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో నిర్మించిన 44 వంతెనలను ఇటీవల రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ ప్రారంభించారు. వంతెనల్లో అత్యధికంగా లద్దాఖ్ లో పది నిర్మించారు. ఇది కీలకమైనది. అటు చైనా, ఇటు పాకిస్థాన్ లకు సమీపంలో ఉంటుంది. ఇక్కడ వేసవిలోనూ ఎముకలు కొరికే చలి ఉంటుంది. మాములు రోజుల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. మంచు వల్ల విమానాలు, హెలికాఫ్టర్లు కూడా ప్రయాణించ లేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వంతెనల నిర్మాణం ఎంతో ఉపయోగకరమని సైనిక నిపుణులు చెబుతున్నారు.చైనాతో సరిహద్దు గల ఈశాన్య భారతంలో చిట్టచివరి రాష్రమైన అరుణాచల్ ప్రదేశ్, కీలక సరిహద్దు రాష్రమైన జమ్ము-కశ్మీర్,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ల్లో ఈ వంతెనలను నిర్మించారు. సరిహద్దు రహదారుల సంస్థ (బీ ఆర్ వో- బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్) వీటిని నిర్మించింది. వీటిల్లో అరుణాచల్, కాశ్మీర్, సరిహద్దులు అత్యంత కీలకమైనవి. చైనా, పాకిస్థాన్ తో కలిపి భారత్ దాదాపు ఏడువేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. చైనాతో 3,410 కిలోమీటర్ల సరిహద్దుంది. పాకిస్థాన్ తో కూడా దాదాపు అంతే ఉంది.వంతెనల నిర్మాణం వల్ల సరిహద్దులకు సైన్యాన్ని, ఆయుధాలను, ఇతర వాహనాలను చేరవేయడం సులభమవుతుంది. ఇప్పటివరకు సరైన మౌలిక సదుపాయాలు లేనందున సైనికులు, ఆయుధాలు, వాహనాల తరలింపు సమస్యాత్మకంగా ఉండేది. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఫలితంగా గంటల కొద్దీ సమయం వథా అయ్యేది. అదే సమయంలో ఖర్చు కూడా తడిసి మోపెడయ్యేది. విమానాల్లో సైనికులను తరలించాల్సి వచ్చేది. విమానాల ద్వారా భారీయెత్తున సైనికుల తరలింపు కష్టం. సకాలంలో సరిహద్దులకు చేరుకోవడం కష్టమయ్యేది. తాజాగా వంతెనల నిర్మాణం వల్ల ఈ సమస్య తప్పిందని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీ ఆర్ వో) డైరెక్టర్ జనరల్ హర్పాల్ సింగ్ వెల్లడించారు.వాస్తవాధీన రేఖ సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద చిన్నపాటి విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్మించిన ఈ వంతెనల వల్ల కేవలం సైన్యానికే కాదు, ఈ ప్రాంతంలోని సాధారణ ప్రజలకు కూడా సౌకర్యం కలుగుతుంది. వారి రాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయి. వంతెనల నిర్మాణంతోనే సరిపెట్టకుండా ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రక్షణ శాఖ చర్యలు తీసుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ‘నెచిపు’ ప్రాంతం వద్ద సొరంగ నిర్మాణానికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. 450 మీటర్ల పొడవుతో రెండు లైన్లతో దీనిని నిర్మిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఇది సైన్యానికి ఉపయోగ పడుతోంది. చైనా సరిహద్దుల్లోని సిక్కిం రాష్రంలోనూ ప్రత్యమ్నాయ మార్గాన్ని రాజనాధ్ ప్రారంభించారు. సిక్కిం రాజధాని గ్యాంగటాక్- నాధులా మార్గమిది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో మెరుగైన రహదారులను నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.21,040 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తోంది. ఈ పనులు మూడోవంతు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది వేసవి నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇవి పూర్తయితే భారత్ సరిహద్దులు శత్రు దుర్బేధ్యంగా తయారవుతాయనడంలో సందేహం లేదు.