YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా

బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా

లండన్, డిసెంబర్ 22 కొత్త రకం కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో మునుపటి పరిస్థితులు నెలకొన్నాయి. ఐరోపా దేశాల్లో లాక్‌డౌన్ తరహా పరిస్థితులు ఉన్నాయి. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. యూకే నుంచి వచ్చే ఫ్లైట్లను రద్దు చేశాయి. కొత్త వైరస్ ఇటు భారత్‌లోనూ కలకలం రేపుతోంది.యూకే నుంచి ఢిల్లీ చేరుకున్న వారిలో ఇప్పటివరకు ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి కోల్‌కతా వచ్చిన ఇద్దరికి, చెన్నై చేరుకున్న మరో వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. బెంగళూరులో బ్రిటన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ముంబైలో మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లోనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే.. పాజిటివ్‌గా తేలిన వారిలో బయటపడింది కొత్త వైరసా, కాదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. బాధితుల నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అక్కడ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసులపై ప్రకటన చేయనున్నారు.యూకే నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి 266 మంది ప్రయాణికులు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారిని హాస్పిటళ్లకు తరలించారు. నెగటివ్ వచ్చినా.. తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అధికారులు నిర్దేశించారు.యూకే నుంచి వచ్చే విమానాలపై భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు.. కొత్త వైరస్ నియంత్రణ చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా ఐరోపా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను అధికారులు గుర్తిస్తున్నారు. అలాంటి వారందరికీ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.చెన్నైలో అలాంటి వారిని 1080 మందిని గుర్తించి క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌లో పరిస్థితిపై వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు.. కొత్త వైరస్ ఆనవాళ్లు సెప్టెంబర్ చివరి వారంలోనే బయటపడ్డాయని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది.

Related Posts